భీమవరం : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో శుక్రవారం రాష్ట్ర స్థాయి థీమ్ ఆధారిత యోగా ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ యోగా భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన గొప్ప వరమన్నారు. ప్రతిరోజూ యోగ సాధన ద్వారా శరీరంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయని ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో మానసిక ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో యోగ సాధన ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు. యోగా అనంతరం కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ, ప్రిన్సిపల్ మురళీకృష్ణంరాజు, జిల్లా క్రీడల అధికారి మోహన్‌దాస్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం : భీమవరం పట్టణం గునుపూడి ప్రాంతంలో నూతనంగా ఏర్పాటుచేసిన నారాయణ స్కూల్ నిబంధనకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారంటూ శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రసాద్ మాట్లాడుతూ నారాయణ స్కూల్‌కు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో స్కూల్ నిర్వహించకూడదని విద్యా శాఖ నోటీసులు ఇచ్చినా వాటిని లెక్కచేయకుండా తరగతులు నిర్వహించడం దారుణమన్నారు. ఒక పక్క స్కూల్ బిల్డింగ్ నిర్మాణం పనులు, ఎలక్ట్రికల్ పనులు జరుగుతున్నా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. అక్రమంగా పుస్తకాలు, విద్యాసామాగ్రి విక్రయిస్తున్నారన్నారు. రాష్ట్ర మంత్రి నారాయణ అండదండలతోనే అక్రమంగా విద్యావ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. స్కూల్‌ను తక్షణం సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేయడంతో డీవైఈవో రమేష్ స్కూల్ వద్దకు వచ్చి పుస్తకాల గదిని సీజ్ చేశారు.
భీమవరం: జిల్లాలో గత నెలలో నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 68.88 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాఽధించారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ శుక్రవారం చెప్పారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో నిర్వహించిన పరీక్షలకు 3,698 మంది హాజరుకాగా 2,547 మంది ఉత్తీర్ణత సాఽధించారన్నారు. వీరిలో 2,313 మంది బాలురకు 1,559, 1,385 మంది బాలికలకు 988 మంది ఉత్తీర్ణ సాధించారని చెప్పారు.
భీమవరం: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా పనిచేసిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవాల్లో భాగంగా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి మహిళలకు సెర్ప్ ద్వారా అందించే రుణాల చెక్‌ను అందచేశారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకటసత్యనారాయణ, కలెక్టర్ చదలవాడ నాగరాణి తదితరులు పాల్గొన్నారు.


