భీమవరం: వీబీ జీరామ్‌జీ నూతన మార్గదర్శకాలను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కం శెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం భీమవరంలో బళ్ల చిన వీరభద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉసురు తీసి కేంద్ర ప్రభుత్వం వీబీ జీరాంజీ పథకాన్ని తెచ్చి కూలీల హక్కులను కాలరాసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకపక్క 125 రోజులు పని దినాలు పెంచామని చెప్పి 60 రోజుల నిషేధం విధించడం కూలీలను మోసగించడమేనన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు కవురు పెద్దిరాజు, ఎ.రవి మాట్లాడుతు గ్రామీణ పేదలపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫొటో విధానాన్ని రద్దు చేసి మాన్యువల్ మస్తర్ వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శేషపు అశ్రియ్య. ఎడ్ల చిట్టిబాబు, షేక్ పాదుషా, జె వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: భీమవరం మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జూలై 11వ తేదీన జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు భీమవరం 3వ జిల్లా అదనపు న్యాయమూర్తి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ బి లక్ష్మీనారాయణ తెలిపారు. జాతీయ లోక్‌అదాలత్‌లో అన్ని సివిల్ కేసులు, రాజీకాదగ్గ క్రిమినల్ కేసులు, ప్రామిసరీ నోటు బాకీ కేసులు, మోటారు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కేసులు, భార్యాభర్తల తగాదా, మనోవర్తి, గృహ హింస కేసులు, చెక్కు బౌన్స్, ఎకై ్సజ్ కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. రాజీ విశిష్టతను కక్షిదారులకు తెలియజేసి జాతీయ లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసుల రాజీకి ప్రయత్నం చేయాలని న్యాయవాదులు, పోలీసు అధికారులకు జడ్జి లక్ష్మీనారాయణ సూచించారు.
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టును ట్రైనీ ఐఏఎస్ అధికారుల బృందం మంగళవారం సందర్శించింది. ‘ఏపీ దర్శన్’ కార్యక్రమంలో భాగంగా 2025 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు పోలవరం ప్రాజెక్ట్, జలవిద్యుత్ కేంద్రంతో పాటు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. ఈ బృందంలో సీహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి, హరి ఓం పాండియా, క్షితిజ్ ఆదిత్య శర్మ, నమ్రత్ అగర్వాల్, పవన్ తేజా ఏఆర్, ప్రియా, సుయాష్ కుమార్, వెంకటేష్ బన్నా ఉన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఈ రెడ్డి రామచంద్రరావు, ఈఈ బాలకృష్ణ, డీఈ శ్రీనివాస్, ఎంఈఐఎల్ ప్రాజెక్టు జీఎం ఎ.గంగాధర్, డీజీఎం మురళి పమ్మి అధికారులకు ప్రాజెక్టు గురించి సమగ్రంగా వివరించారు. ప్రాజెక్టు లక్ష్యాలు, రూపకల్పన, నిర్మాణ పురోగతి, సాంకేతిక సవాళ్లు, పూర్తయిన తర్వాత కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
కై కలూరు: సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంఫవర్డ్ కమిటీ(సీఈసీ) నిర్ణయం మేరకు కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో సరిహద్దుల నిర్ణయానికి కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాలతో మండల తహసీల్దారు రామకృష్ణ 10 కొల్లేటిలంక గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పల్లెవాడ, భుజబలపట్నం, గోనెపాడు, ఆటపాక, కై కలూరులో రెండో రోజు మంగళవారం సభలు నిర్వహించారు. అభయారణ్యం సరిహద్దుల పునః సర్వే, నీటి ప్రవాహాలు, పక్షుల సంరక్షణ ప్రాంతం, కాలుష్యం కలవడం, కొల్లేరు పరివాహక ప్రాంతంలో జీ రాయితీ, సొసైటీ భూముల వివరాలు, ఆక్రమణలను తొలగించుట వంటి అంశాలపై అవగాహన, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.
జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెంలో మద్ది ఆంజనేయస్వామివారికి మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వివిధ సేవల రూపేణా ఆలయానికి రూ.3,33,961 ఆదాయం సమకూరినట్లు ఆలయ సహాయ కమిషనర్, ఈవో ఆర్‌వీ చందన, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ తెలిపారు.


