ఆక్వా ఫీడ్ తయారీదారులు, సీడ్ అమ్మకందారులు, రొయ్యల కొనుగోలుదారులు వీరంతా సిండికేట్‌గా తయారై ఆక్వారైతుల జీవితాలను నాశనం చేస్తున్నారు. పెరుగుతున్న ధరలను అరికట్టాలని ఆక్వారైతులు నిరసన తెలుపుతున్నా కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థమవుతోంది. నేతల తీరును ఆక్వారైతులు గమనిస్తూనే ఉన్నారు.
– పీవీఆర్‌కే ఆంజనేయరాజు, ఆక్వారైతు,
వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు, వాండ్రం, ఉండి మండలం
ఆక్వారైతుల అండదండలతో గత ఎన్నికల్లో గెలిచిన మనం వారికి తగిన న్యాయం చేయాలి. ఇప్పటికే ఆక్వారైతులు చాలాకాలంగా రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఆక్వారైతుల వల్ల కోట్లాది రూపాయల ఆదాయం పొందుతున్న ప్రభుత్వం, ఇప్పుడు వారినే నిర్లక్ష్యం చేస్తే రైతులంతా మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉంది.
– రుద్దరాజు యువరాజు, టీడీపీ ఎంపీటీసీ,
ఆక్వారైతు రాష్ట్ర నాయకుడు, కలిగొట్ల, ఉండి మండలం
గత ఎన్నికల్లో ఆక్వారైతులు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో కూటమికి క్లీన్ స్వీప్ విజయాన్ని అందించి 34 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. కానీ ఇప్పుడు ఆక్వా రైతులకు జరుగుతున్న అన్యాయంపై వారంతా మండిపడుతున్నారు. ఆక్వా రైతులు తమ మద్దతును వెనక్కి తీసుకుంటే కూటమికి తగిన బుద్ధి వస్తుంది.
– యడవల్లి వెంకటేశ్వరరావు, జనసేన మండలాధ్యక్షుడు, ఆక్వారైతు, పాములపర్రు, ఉండి మండలం
నేను టీడీపీ కార్యకర్తను. గత ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు ఎంతో కృషి చేశాను. కానీ ఇప్పుడు అదే ఆక్వారైతుల పాలిట శాపంగా, బాధాకరంగా మారుతుందని ఊహించలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆక్వారైతు రోడ్డెక్కాడు. ఆక్వారైతులు ఏం పాపం చేశారని కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తోంది?
– పూసపాటి వెంకటరాజు,
ఆక్వారైతు రాష్ట్ర నాయకుడు, టీడీపీ కార్యకర్త, ఉండి


