భీమవరం: మున్సిపాలిటీల్లోని 14 కీలక రంగాలను ప్రైవేటీకరణ చేస్తూ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 975 తక్షణం రద్దు చేయాలని సోమవారం ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వాసుదేవరావు మాట్లాడుతూ మునిసిపాలిటీల్లో ప్రజా సేవలు ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. వెంటనే కార్మికుల సంఖ్య పెంచాలని, పదవీ విరమణ చేసిన కార్మికుల స్థానంలో కొత్తగా కార్మికులను నియమించాలని కోరారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగినందున కార్మికులు తక్కువ జీతాలతో తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రం అసిస్టెంట్ కమిషనర్‌కు అందజేశారు.
భీమవరం (ప్రకాశంచౌక్): క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కలెక్టర్ సీహెచ్ నాగరాణి అభినందించారు. శాప్ లీగ్స్ –2026 బాక్సింగ్ పోటీల్లో జిల్లా నుంచి కే.శరణ్య(పెనుమంట్ర జెడ్పీ హై స్కూల్) 44 నుంచి 46 కేజీల కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించింది. కె.గిరి వెంకటస్వామి(వీరవాసరం జెడ్పీ స్కూల్) బాలుర విభాగంలో 49 నుంచి 52 కేజీల కేటగిరిలో రజత పతకం సాధించారు. సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో 67 నుంచి 70 కేజీల విభాగంలో కె. రామ అంజలి బాలికల విభాగంలో బంగారు పతకం సాధించింది. వీరిని కలెక్టర్ ప్రశంసించారు.
జీఎస్టీ వసూళ్లలో చొరవ చూపాలి
కలెక్టర్ అధ్యక్షతన వాణిజ్య పన్నుల వసూళ్లలో చేపట్టాల్సిన చర్యలపై సోమవారం వాణిజ్య పన్నుల శాఖతో పాటు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జీఎస్టీ వసూళ్లు పెంచడం, పన్ను చెల్లింపుల పర్యవేక్షణ కట్టుదిట్టం చేయడం వంటి అంశాలపై సవివరంగా చర్చించారు.
భీమవరం(ప్రకాశం చౌక్): పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ప్రతి అర్జీకి శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలలో పాల్గొని అర్జీలు స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా పరిష్కరించి, ఫిర్యాదుదారులు సంతృప్తి చెందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్‌రెడ్డి, డీఆర్వో బి,శివనారాయణ రెడ్డి, డ్వామా పీడీ కెసిహెచ్ అప్పారావు, జిల్లా పంచాయతీ అధికారి దోసిరెడ్డి పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని
● పోలీసు కానిస్టేబుల్ సోమేశ్వరరావు వల్ల తనకు తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామానికి చెందిన పార్సి ప్రభాకరరావు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు.
● తన భార్యపై దాడి జరిగిందని కేసు పెట్టడానికి వెళ్తే నర్సాపురం సీఐ తమ కేసు తీసుకొలేదని నర్సాపురం 4 వార్డుకు చెందిన సంగాని ఆనంద్‌కుమార్ సోమవారం ఫిర్యాదు చేశాడు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఎయిడెడ్ పాఠ శాలలుగా పనిచేసి ప్రస్తుతం మండల పరిషత్ యాజమాన్యంలో విలీనం చేసిన ప్రాథమిక పాఠశాలలు, మోడల్ ప్రైమరీ పాఠశాలల నిర్వహణ నిధులు తక్షణమే మంజూరు చేసి విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ –1938 ఏలూరు జిల్లా నాయకులు సమగ్ర శిక్ష ప్రాజెక్టు కోఆర్డినేటర్ కే పంకజ్ కుమార్‌ను కోరారు. నాయకులు సోమవారం ఆయన్ను కలిశారు.


