తాడేపల్లిగూడెం: విద్యార్థులు ఆధునిక సాంకేతిక విషయాలను నిరంతరం తెలుసుకోవాలని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కె.ధనుంజయరావు కోరారు. సోమ వారం వెంకట్రామన్నగూడెం ఉద్యాన కళాశాలలో జరిగిన మానవవనరుల అభివృద్ధి శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఉద్యాన పంటల పర్యవేక్షణ, భూభాగ పటాల తయారీ, పరిశోధన కార్యకలాపాలు, పంట నిర్వహణ తదితర రంగాల్లో డ్రోన్ సాంకేతికతకు విశేష ప్రాధాన్యముందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని, భవిష్యత్‌లో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీన్ ప్రసన్నకుమార్ మాట్లా డుతూ డ్రోన్ సాంకేతికతను అందించేందుకు ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎన్‌బీవీ.చలపతిరావు, ప్రాజెక్టు ప్రధాన పరిశోధకులు బీఎం.చెన్నకేశవులు, సహ పరిశోధకులు ఎన్.ఇమ్మాన్యుయేల్ తదితరులు పాల్గొన్నారు.


