19న ఏజెన్సీలో రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ పర్యటన | - | Sakshi
Sakshi News home page

19న ఏజెన్సీలో రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ పర్యటన

Jun 14 2026 11:43 AM | Updated on Jun 14 2026 11:43 AM

19న ఏజెన్సీలో రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ పర్యటన రైలు ఢీకొని వృద్ధుడి దుర్మరణం రెగ్యులరైజ్‌ చేయాలి మహిళ మృతిపై ఆందోళన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో పెరుగుతున్న ‘గోల్డ్‌’మాల్‌ లెక్కలు

బుట్టాయగూడెం: ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ సోళ్ల బొజ్జిరెడ్డి ఏజెన్సీలో పర్యటించనున్నారు. ఆరోజు ఉదయం 7 గంటలకు రంపచోడవరం నుంచి బయలుదేరి 8:30కు బుట్టాయగూడెం మండలం కేఆర్‌పురం ఐటీడీఏ అతిథి గృహానికి చేరుకుంటారని అధికారులు తెలిపారు. అనంతరం 9 గంటలకు అక్కడి నుంచి గుబ్బల మంగమ్మ గుడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12:30కు జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి వెళ్లి రోగులకు అందుతున్న వైద్యసేవలను, సౌకర్యాలను పరిశీలిస్తారన్నారు. అనంతరం ఉప్పలమెట్టలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల సందర్శన, మధ్యాహ్నం 3.30కు బుట్టాయగూడెం మండలం వెలుతురువారిగూడెం చేరుకుని అక్కడి గిరిజనులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకుంటారని తెలిపారు. సాయంత్రం 5:15కు కేఆర్‌పురం ఐటీడీఏ సమావేశ మందిరంలో గిరిజనులు, గిరిజన ఉద్యోగులు, గిరిజన సంఘాల ప్రతినిధులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారని తెలిపారు. రాత్రి 8:30కు ఏలూరు చేరుకుని అక్కడ బస చేస్తారని చెప్పారు.

భీమడోలు: జాతీయ రహదారి పూళ్ల, భీమడోలు రైల్వే స్టేషన్ల మధ్య గల అండర్‌ పాస్‌ సమీపాన శనివారం ఓ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు కనుగొన్నారు. మృతుని శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై పి.అప్పారావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని రైలు ఢీకొనడం లేదా రైలు నుంచి జారిపడడంతో మృతదేహాం నుజ్జునుజ్జుగా మారిందని రైల్వే పోలీసులు తెలిపారు. వృద్ధుని వయస్సు 60 నుంచి 70 ఏళ్ల మధ్య ఉంటుందని, ఎత్తు 5.5 అడుగులు, ఛామనఛాయ, నలుపురంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. వృద్ధుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గూడెం స్టేషన్‌ మాస్టార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆప్కాస్‌ ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్‌ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 12వ పీఆర్‌సీ ప్రకటించాలని, ఆప్కాస్‌ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని ఆప్కాస్‌ ఉద్యోగుల జిల్లా సదస్సు డిమాండ్‌ చేసింది. శనివారం ఆప్కాస్‌ ఉద్యోగుల జిల్లా సదస్సు ఆర్‌ఆర్‌ పేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపంలో జరిగింది.

తణుకు అర్బన్‌: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యులు తణుకులో ఒక ప్రైవేటు ఆస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. శనివారం రాత్రి తణుకు పాతవూరుకు చెందిన సూరవరపు వరలక్ష్మి (58) ఛాతీ నొప్పితో బాధపడుతుండగా ఆమె కుటుంబసభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రి వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించి ఇంజక్షన్‌ చేశారు. అనంతరం వరలక్ష్మి బంధువులు ఆమెను రాజమండ్రికి తీసుకువెళ్తామంటూ బయటకు తీసుకురాగా ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. పరీక్షిక్షించిన వైద్యులు ప్రాణంలేదని నిర్ధారించగా, ఇంజక్షన్‌ కారణంగానే మృతిచెందార ంటూ మృతురాలి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పట్టణ సీఐ జె.వెంకటరమణ, ఎస్సైలు ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.

మరో 11 ఖాతాల్లో 412 గ్రాముల బంగారం మాయం

జంగారెడ్డిగూడెం: స్థానిక బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా శాఖలో బంగారం మాయమైన ఘటనలో అధికారుల తనిఖీలు కొనసాగుతుండగా, రోజురోజుకూ గోల్డ్‌మాల్‌ లెక్కలు భారీగా పెరుగుతున్నాయి. శనివారం నిర్వహించిన బంగారం ప్యాకెట్ల తనిఖీల్లో మరో పెద్ద లీల వెలుగుచూసింది. ఈ రోజు జరిపిన పరిశీలనలో 11 ఖాతాలకు సంబంధించిన సుమారు 412 గ్రాముల బంగారం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. శనివారం నాటి లెక్కింపుతో కలిపి ఇప్పటివరకు మొత్తంగా 3 కిలోల 200 గ్రాములకు చేరుకోవడం బ్యాంకు వర్గాల్లో కలకలం రేపుతోంది. బ్యాంకు అధికారులు వరుసగా ఏడో రోజు కూడా గట్టి నిఘా నడుమ బంగారం ప్యాకెట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఖాతాదారులు పెద్ద సంఖ్యలో బ్యాంకు వద్దకు చేరుకుని, తమ తాకట్టు బంగారం సురక్షితంగా ఉందో లేదోనని అధికారులను ఆరా తీస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement