రక్తదానంతో ప్రాణదానం | - | Sakshi
Sakshi News home page

రక్తదానంతో ప్రాణదానం

Jun 14 2026 11:43 AM | Updated on Jun 14 2026 11:43 AM

భీమవరం (ప్రకాశం చౌక్‌): రక్తదానం చేయడం అంటే ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయడమే. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి, అత్యవసర శస్త్రచికిత్సలు అవసరమైన వారికి రక్తాన్ని అందించి ఆదుకునే రక్తదాతలు నిజమైన ప్రాణబంధువులు. పశ్చిమగోదావరి జిల్లాలోని యువత, ఉద్యోగులు సోషల్‌ మీడియా ద్వారా రక్తం అవసరాన్ని తెలుసుకొని పెద్దఎత్తున స్పందిస్తున్నారు. రక్తదానంలో జిల్లాను ఉత్తమంగా నిలిపి, రాష్ట్రపతి నుంచి రెడ్‌క్రాస్‌ ప్రశంసా పత్రాలు అందుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులే దీనికి నిదర్శనం. జూన్‌ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా బ్లడ్‌ బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి రక్తదానంపై అవగాహన కల్పిస్తున్నాయి. జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో రాజకీయ నాయకులు, సినీ హీరోల పుట్టినరోజుల సందర్భంగా అభిమానులు, యువత స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తదానం చేయడంలో ముందుంటుండడం విశేషం.

జిల్లాలో రెడ్‌క్రాస్‌ సేవలు

2022లో అప్పటి కలెక్టర్‌ పి.ప్రశాంతి చొరవతో భీమవరం రాయలంలో రూ.1.50 కోట్లతో జిల్లా స్థాయి రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటైంది. తణుకు, తాడేపల్లిగూడెంలోనూ ఇవి ఉన్నాయి. ఏడాదికి 21 వేల యూనిట్ల రక్తం లక్ష్యం కాగా 18,500 యూనిట్లు రక్తం సేకరణ అవుతుంది. అందులో రెడ్‌క్రాస్‌ ద్వారా 3,200 యూనిట్లు సరఫరా అవుతుంది. ప్రభుత్వం ద్వారా 2 బ్లడ్‌ బ్యాంకులు, 7 ప్రైవేట్‌ బ్లడ్‌ బ్యాంకులు ఉన్నాయి. అన్ని కలుపుకుని ఏడాదికి 18,500 యూనిట్లు రక్త సేకరణ చేస్తున్నారు. జిల్లాలో తలసేమియా బాధితులు 45 మందికి రెడ్‌క్రాస్‌ ద్వారా బ్లడ్‌ డోనేషన్‌ చేస్తున్నారు.

రక్తదానంపై అపోహలు వద్దు

మన శరీరంలో 5 లీటర్ల రక్తం ఉంటే, రక్తదానంలో కేవలం 350 మిలీ లీటర్లు మాత్రమే తీసుకుంటారు. దీనివల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయని, హిమోగ్లోబిన్‌ తగ్గుతుందని అనుకోవడం కేవలం అపోహ మాత్రమే. ఎటువంటి అపోహలు పెట్టుకొకుండా రక్తదానం చేసి అపదలో ఉన్న వారి ప్రాణాలు రక్షించాలని వైద్యులు చెబుతున్నారు.

రక్తదానానికి అర్హతలు

● వయసు 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉండాలి. బరువు కనీసం 45 కేజీల పైబడి ఉండాలి.

● రక్తంలో హిమోగ్లోబిన్‌ కనీసం 12.5 గ్రాములు ఉండాలి. ప్రతి 3 నెలల (పురుషులు), 4 నెలల (సీ్త్రలు) వ్యవధితో ఇవ్వవచ్చు.

● రక్తదానానికి 12 గంటల ముందు, తర్వాత ఆల్కహాల్‌ తీసుకోకూడదు.

రక్తదానం ఎవరు చేయకూడదంటే..

శ్వాసకోశ వ్యాధులు, కేన్సర్‌, గుండెజబ్బులు, మధుమేహం, ఆస్తమా, ఫిట్స్‌, కాలేయ వ్యాధులు, ఎయిడ్స్‌ లక్షణాలు ఉన్నవారు రక్తదానం చేయకూడదు. మలేరియా, టైఫాయిడ్‌ వంటి జ్వరాలు ఉన్నప్పుడు ఇవ్వరాదు. సీ్త్రలు రుతుక్రమ సమయంలో, గర్భం దాల్చినప్పటి నుంచి పాలిచ్చేంత వరకు రక్తదానం చేయరాదు. రక్తాన్ని సేకరించాక అన్ని రకాల పరీక్షలు చేసి, సురక్షితమని తేలాకే ఇతరులకు ఇస్తారు. ఒక మైక్రో లీటరు రక్తంలో 4.5–5.5 మిలియన్ల ఎర్ర రక్తకణాలు (ఆక్సిజన్‌ సరఫరాకు), 4–11 వేల తెల్ల రక్తకణాలు (రోగనిరోధక శక్తికి), రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే 1.5–4.5 లక్షల ప్లేట్‌లెట్స్‌ ఉంటాయి.

రక్తదానంలో ఆదర్శంగా జిల్లా యువత, ఉద్యోగులు

నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement