నరసాపురం రూరల్: నరసాపురం, మొగల్తూరు ప్రాంతాల్లో ఏటా మామిడి సీజన్ చివరిలో ప్రారంభమవుతుంది. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో మామిడి పంట బాగా కాపుకాసింది. అయితే, ఇటీవల ఎండలు తీవ్రంగా ఉండటం, వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా శనివారం వేకువజామున భారీ వర్షం కురిసింది. దీంతో పక్వానికి వచ్చిన మామిడి కాయలు పెద్దఎత్తున రాలిపోయాయి. ఫలితంగా కనీసం పెట్టుబడులు కూడా దక్కడం గగనమని రైతులు వాపోతున్నారు. దేశ, విదేశాలకు ఎగుమతి అయ్యే నరసాపురం ప్రాంత బంగినపల్లి మామిడికి మంచి డిమాండ్ ఉన్న సమయంలో.. ఈ అకాల వర్షాలు కురవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరోపక్క ఈ ప్రాంతంలో మామిడి సీజన్ ముగిసే సమయం దగ్గరపడుతుండటంతో, లక్షలు పెట్టి తోటలను కొనుగోలు చేసిన వ్యాపారులు, రైతులు తాము తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఒక్కసారిగా మార్కెట్‌లోకి పెద్దఎత్తున మామిడికాయలు రావడంతో ధరలు అమాంతం పడిపోయాయని, దీనివల్ల భారీగా నష్టాలు చవిచూడాల్సి వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.


