భానుడి భగభగలు | - | Sakshi
Sakshi News home page

భానుడి భగభగలు

May 3 2026 10:10 AM | Updated on May 3 2026 10:10 AM

ఉమ్మడి పశ్చిమలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

ఉక్కబోతతో జనం విలవిల

నరసాపురం: ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే ఎండలు అదరగొడుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత వారం రోజుల నుంచి 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 10 రోజుల్లో జిల్లాల్లో అత్యధికంగా పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెలలో ఎండలు మరింత ప్రతాపం చూపిస్తున్నాయి. రాబోయో రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో? అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గాలిలో తేమ శాతంలో భారీ హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. దీంతో రాత్రి పూట కూడా ఉక్కబోత ఇబ్బంది పెడుతుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతతో గాలిలో తేమ శాతంలో మార్పులు ఎక్కువగా ఉంటున్నాయి. పగటిపూట 40 నుంచి 50 శాతం, తెల్లవారుజాము సమయంలో 85 నుంచి 90 శాతం తేమ నమోదవుతుంది. మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. గత 10 రోజుల నుంచి ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పగటిపూట అత్యధికంగా 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే ఇలా ఉంటే, మే నెలలో మిగతా రోజులు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది.

గత ఏడాది కూల్‌ సమ్మర్‌ : ఉమ్మడి పశ్చిమలో గత ఏడాది వేసవి మొత్తం చాలా కూల్‌గా గడిచింది. మే నెలలో తుఫాన్‌ పట్టడంతో కొన్ని రోజులు ఎండ వేడిమి అసలు తెలియలేదు. మే నెల మొత్తం ఊహించిన దానికంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఐదేళ్ల పరిస్థితి పరిశీలిస్తే గత ఏడాది వేసవి చల్లగా సాగింది. ఈ సంవత్సరం పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో భానుడు ఉగ్రరూపం దాల్చే అవకాశాలు కనిసిస్తున్నాయి.

జాగ్రత్తలు అవసరం: వైద్యులు

అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి ధీర్ఘకాల రోగులు, చిన్నపిల్లలు మారిన వాతావరణ పరిస్థితులతో ఇబ్బందులు పడుతుంటారు. ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పిలల్లను ఎండలో బయట తిరగకుండా చూడాలని, వృద్ధుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement