సాక్షి టాస్క్‌ఫోర్స్: బిడ్డ కోసం ఓ కన్నతల్లి కంటి నిండా ఒత్తులతో ఎదురుచూస్తోంది. కన్నపేగు కనిపించక గర్భశోకాన్ని అనుభవిస్తోంది. ఏ చిన్న అలికిడి వినిపించినా తీసుకొచ్చారా.. నా బాబూను అంటూ కన్నీళ్లతో దేవులాడుతోంది. బుడిబుడి అడుగులతో చలాకీగా ఇంటి బయట ఆడుకుంటున్న రెండున్నరేళ్ల ఆకేటి మోక్షిత్ కనిపించకుండా పోయి మూడు నెలలు కావస్తోంది. ముదినేపల్లి మండలం శ్రీహరిపురంలో మోక్షిత్ మిస్సింగ్ కేసు పోలీసు వ్యవస్థకు సవాల్ విసురుతోంది. సాంక్షేతిక పరిజ్ఞానంతో పెద్ద కేసులను ఇట్టే పట్టేసుకుంటున్న పోలీసులకు కనీసం చిన్న ‘క్లూ’ కూడా మోక్షిత్ కేసులో లభించలేదు.
ముద్దుముద్దు మాటలతో ముచ్చట గొలిపే ఆకేటి మోక్షిత్ ఆటలాడుకుంటూ ఈ ఏడాది జనవరి 20న శ్రీహరిపురం ఇంటి బయట కనిపించలేదు. తల్లి శిరీష వెంటనే ముదినేపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ముందుగా ఇంటి వద్ద పెద్ద కాల్వలో పడి కొట్టుకుపోయాడనే అనుమానాలు పెరిగాయి. ఇదే కాల్వలో కొద్ది రోజులు ముందు ఓ వృద్ధుడు కొట్టుకుపోయి మరణించాడు. పోలీసులు, బంధువులు కాల్వ లాకులు దింపు మరీ జల్లిడ పట్టినా బాబు జాడ లేదు. పోలీసులు సమీపంలో సీసీ కెమెరాలను పరిశీలించినా మోక్షిత్ అనవాళ్లు కనిపించలేదు. స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) బాధితురాలిని పరామర్శించి జిల్లా ఎస్పీతో మాట్లాడారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, డీఎస్పీలు స్వయంగా వచ్చి విచారణ చేశారు. అయినా ఇంకా మిస్టరీ వీడలేదు.
భర్తను కోల్పోయి.. బిడ్డను పోగొట్టుకుని..
బిడ్డను పోగొట్టుకున్న తల్లి శిరీష దీనాగాథ మనసును కలిచివేస్తోంది. వరసుకు మేనత్త కుమారుడు కానుకొల్లుకు చెందిన అకేటి శ్రీహరితో 2020లో ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన శిరీషకు వివాహం జరిగింది. వీరికి ఆకాష్ (5), మోక్షిత్ (రెండున్నర) సంతానం. భర్త శ్రీహరి ఆక్వా చెరువుల సాగు చేసేవాడు. అన్యోన్యంగా సాగుతున్న ఆ కుటుంబంలో పెద్ద విషాదం చోటుచేసుకుంది. గతేడాది జూన్ 21న పేయ్యేరు సమీప కానుకొల్లు రోడ్డులో ఆగివున్న లారీని ఢీకొట్టి శిరీష భర్త శ్రీహరి మృతి చెందాడు. పిల్లలతో శిరీష పుట్టిళ్లు శ్రీహరిపురంలో ఉంటుంది. భర్త చనిపోయిన దాదాపు 7 నెలలకే చిన్న కుమారుడు మోక్షిత్ మిస్సింగ్ కేసుగా మారాడు. అటు భర్త పోయి పుట్టెడు దుఖఃంతో పాటు కన్న బిడ్డ కనిపించకపోవడంతో ఆ మాతృమూర్తి తల్లిడిల్లిపోతుంది. పెద్ద కుమారుడు చదువు సైతం ప్రశ్నార్థకంగా మారింది.
అనుమానాలు ఆజ్యం పోసిన
పసిపిల్లల విక్రయాలు కేసు
మోక్షిత్ మిస్సింగ్ కేసు దుమారం రేపుతోంటే ముదినేపల్లి మండలంలో పసిపిల్లల విక్రయాలు కేసు పలు అనుమానాలకు అజ్యం పోసింది. నియోజకవర్గంలో అన్నవరం, కానుకొల్లు, మండవల్లి వంటి ప్రాంతాల్లో ఐదుగురు పిల్లల విక్రయాలు జరిగాయని 9 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఈడేపల్లికి చెందిన అబ్బిశెట్టి వీరాకుమారి(వీరమ్మ)ను ఏ–1 ముద్దాయిగా చేర్చారు. ఆమె ఓ రాజకీయ నేత తల్లికావడంతో ఇది పెద్ద చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే పిల్లల విక్రయాల్లో పలు పర్యాయాలు జైలు జీవితం అనుభవించిన విజయవాడకు చెందిన ఫరానాతో ఈ ప్రాంతంలో కొందరికి సంబంధాలు ఉన్నాయి. అయితే పోలీసులు మాత్రం పిల్లల విక్రయాలకు మోక్షిత్ కేసునకు సంబంధం లేదంటున్నారు. మరొపక్క మోక్షిత్ జాడ చూపించాలని శ్రీహరిపురం గ్రామస్తులు రోడ్లుపై ఆందోళనలు సైతం చేస్తున్నారు.
బిడ్డను పోగొట్టుకున్నాను. దాదాపు మూడు నెలలు కావస్తోంది. మోక్షిత్ జ్ఞాపకాలు కలిచివేస్తున్నాయి. ముదినేపల్లి పోలీసుల శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. నా బిడ్డను నాకు అప్పగించండి. మాకు ఎవరితోనూ విభేదాలు లేవు. ఒక తల్లి పడే ఆవేదన అర్థం చేసుకుని నా బిడ్డను నా చెంతకు చేర్చండి.
–ఆకేటి శిరీష, మోక్షిత్ తల్లి, శ్రీహరిపురం
మోక్షిత్ తల్లి ఫిర్యాదు చేసినప్పటి నుంచి బాలుడి ఆచూకీ కోసం పోలీసు వ్యవస్థ మొత్తం నూరుశాతం ప్రయత్నాలు చేస్తోంది. బిడ్డ కనిపించని రోజున పెద్ద కాల్వలో నీటి ప్రవాహం అధికంగా ఉంది. దీంతో కాల్వలో గాలించాం. ఈ కేసులో ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అన్ని కోణాల నుంచి కేసును దర్యాప్తు చేస్తున్నాం. – వీరభద్రరావు, ఎస్సై, ముదినేపల్లి.
మిస్టరీగా మారిన శ్రీహరిపురం చిన్నారి మోక్షిత్ మిస్సింగ్ కేసు
మూడు నెలలు కావస్తున్నా పురోగతి నిల్
ఆగ్రహం కట్టలు తెంచుకుని గ్రామస్తుల నిరసన
ముదినేపల్లి పిల్లల మిస్సింగ్ కేసుతో పెరిగిన అనుమానాలు


