వంక నాగమణి జీవితం ఆదర్శనీయం | - | Sakshi
Sakshi News home page

వంక నాగమణి జీవితం ఆదర్శనీయం

Apr 16 2026 1:05 PM | Updated on Apr 16 2026 1:05 PM

మాజీ మంత్రి అంబటి రాంబాబు

తణుకులో నాగమణి సంస్మరణ సభ

తణుకు అర్బన్‌: మాజీ ఎమ్మెల్యే వంక సత్యనారాయణ సతీమణి వంక నాగమణి జీవితం ఆదర్శనీయమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తణుకు కమ్మ కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన వంక నాగమణి సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. సీపీఐ తరపున స్వాతంత్య్ర పోరాటం నుంచి ఇతర ఉద్యమాల్లో భర్త సత్యనారాయణ అకుంఠిత దీక్ష వెనుక మహిళా శక్తి రూపంలో నాగమణి ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. కుటుంబ వ్యవస్థను మంచి క్రమశిక్షణతో నడుపుతూ తల్లిగా పిల్లలను ఉన్నత స్థానాలకు చేర్చేందుకు ఆమె వ్యవహరించిన తీరు అజరామరమన్నారు.

కమ్యూనిస్టు సిద్ధాంతాలతో..

కమ్యూనిస్టు సిద్ధాంతం పట్ల అంకిత భావం, కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకున్న వంక నాగమణి జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని సీపీఐ జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అధ్యక్షతన నిర్వహించిన సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. 1948లో బెజవాడలో జరిగిన శిక్షణ తరగతుల్లో పోలీసుల లాఠీచార్జీని ఎదుర్కొని అరెస్టు అయ్యారని ప్రస్తుత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళా సమాఖ్యను బలోపేతం చేయడంలో ఆమె పాత్ర చిరస్మరణీయమని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ మా అమ్మ నేర్పిన క్రమశిక్షణే మా ఉన్నతికి మార్గదర్శకమని అన్నారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే వంక సత్యనారాయణ, వంక నాగమణి దంపతులు సమాజానికి ఎంతో సేవచేశారని వారి పేరుమీద తణుకులో పార్కు నిర్మాణం చేసి వారి విగ్రహాలను నెలకొల్పుతానని స్పష్టం చేశారు. సభకు హాజరైన మాజీ మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజు, భీమవరం వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి చినిమిల్లి వెంకటరాయుడు, వైఎస్సార్‌ సీపీ సీఈసీ సభ్యుడు చీర్ల రాధయ్య, భీమవరం పట్టణ అద్యక్షుడు గాదిరాజు రామరాజు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌, సీపీఐ నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, పెన్మెత్స దుర్గా భవాని, డేగా ప్రభాకర్‌, దారిదీపం సంపాదకులు డీవీవీఎస్‌ వర్మ, సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్‌, వంక రవీంద్రనాథ్‌, వంక రాజకుమారి, వంక రామదాసు, వంక మోహన్‌, కుటుంబసభ్యులు నాగమణి చిత్రపటం వద్ద నివాళులర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement