ముగిసిన శ్రీనివాసుని కల్యాణ మహోత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసునికి జరుగుతున్న కల్యాణ మహోత్సవాలు బుధవారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో శ్రీనివాసునికి, పద్మావతి, అండాళ్ అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ యజ్ఞశాలలో హోమాది కార్యక్రమాలను జరిపారు. రాత్రి ఆలయంలో ద్వాదశ కోవెల ప్రదక్షిణలను ఆలయ అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థులు వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి, అమ్మవార్లకు శ్రీ పుష్పయాగోత్సవాన్ని అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో జరిపారు. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


