మట్టి తవ్వకాలపై రైతుల నిరసన | - | Sakshi
Sakshi News home page

మట్టి తవ్వకాలపై రైతుల నిరసన

Apr 16 2026 1:05 PM | Updated on Apr 16 2026 1:05 PM

మట్టి, ఇసుక మాఫియా: మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు

పెనుగొండ: నక్కల డ్రైయిన్‌లో ఆచంట వద్ద జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసన గళం విప్పారు. బుధవారం భారీ సంఖ్యలో రైతులు ఆచంట తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. గత వారం రోజులుగా నక్కల డ్రైయిన్‌ తవ్వకాలను రైతులు అడ్డుకుంటున్నప్పటికీ, అధికార పార్టీ నాయకులు, అధికారుల అండతో తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్‌కు, మంత్రి అచ్చెన్నాయుడుకు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేకపోవడంతో రైతులు మంగళవారం నక్కల డ్రైయిన్‌ వద్దే బైఠాయించారు. స్థానిక నాయకుల ఒత్తిడితో పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుని పక్కకు తరలించారు. ఈ నేపథ్యంలో, బుధవారం అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొంది రైతులు ధర్నా చేపట్టారు.

అడగడుగునా అడ్డంకులే..

అక్రమ తవ్వకాలకు లేని అడ్డంకులు రైతుల ధర్నాకు ఎదురయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్యా రైతులు నీడ కోసం టెంట్‌ వేయడానికి ప్రయత్నించగా, ఉన్నతాధికారుల సూచన మేరకు స్థానిక అధికారులు అనుమతి లేదంటూ అడ్డుతగిలారు. అక్రమంగా మట్టి తవ్వుతుంటే చర్యలు తీసుకోని అధికారులు, కనీసం టెంట్‌ వేసుకోనివ్వకపోవడంపై రైతులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.

పొంతన లేని సమాధానం

ధర్నా అనంతరం రైతులు తహసీల్దార్‌ బి.సోమేశ్వరరావుకు వినతి పత్రం సమర్పించారు. తవ్వకాలను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించగా.. చర్యలు తీసుకోవాల్సింది డ్రైనేజీ శాఖాధికారులు, మేము కాదుఅని ఆయన సమాధానం ఇవ్వడంతో రైతులు విస్మయానికి గురయ్యారు. సొంత పొలంలో మట్టి తవ్వితే వంద ఆంక్షలు పెట్టే రెవెన్యూ అధికారులు, ఇక్కడ అక్రమాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. దీనికి తహసీల్దార్‌ స్పందిస్తూ.. నన్ను ప్రశ్నించడం ఏమిటి? అని రైతులపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.

ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం

ఇప్పటివరకు ప్రశాంతంగా నిరసన తెలిపామని, ఇప్పటికై నా తవ్వకాలు ఆపకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని రైతులు హెచ్చరించారు. నక్కల డ్రైయిన్‌ వద్దే నిరాహార దీక్షలు చేపట్టి తవ్వకాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

రైతులను ఇబ్బంది పెట్టేలా మట్టి, ఇసుక మాఫియాలు రాజ్యమేలుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు విమర్శించారు. ఆచంట నక్కల డ్రెయిన్‌లో జరుగుతున్న అక్రమ తవ్వకాలను బుధవారం పరిశీలించారు. వారం రోజులుగా పోరాటం చేస్తున్నామని అధికారులు, స్థానిక నాయకులు మట్టి మాఫియాకు వత్తాసు పలుకుతున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రెయిన్‌ వలన వర్షాకాలంలో ఆచంట, పాలకొల్లు, నర్సాపురం నియోజకవర్గంలోని వందలాది ఎకరాలు ముంపు బారిన పడుతున్నాయని, ఈ తరుణంలో డ్రెయిన్‌ గట్టులు తవ్వడం వలన ముంపు ప్రమాదం మరింత ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో నక్కల డ్రెయిన్‌ మరీ వెడల్పుగా ఉండడంతో ఆయా ప్రాంతాలు మట్టిమాఫియాకు వరంగా మారిందన్నారు. దీంతో అక్రమ తవ్వకాలకు ప్రయత్నిస్తున్నారన్నారు. పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లోని లేఅవుట్లకు లక్షలాది రూపాయల విలువ గల మట్టిని తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అక్రమ మట్టి తవ్వకాలపై రైతులు ఫిర్యాదు చేస్తే, వారినే పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమని రంగనాథరాజు అన్నారు. మట్టి తరలిస్తున్న వారికి రెవెన్యూ అధికారులు, పోలీసలు వత్తాసు పలకడం దారుణమన్నారు. సత్వరం తవ్వకాలు నిలుపుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతులతో కలసి పోరాటం చేస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement