బిక్కుబిక్కుమంటున్న ఏజెన్సీ వాసులు
పోలవరం రూరల్: పాపికొండల అభయారణ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో నాలుగు రోజులుగా పులి సంచరిస్తుండగా, ఏజెన్సీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం గుంజవరం సమీపంలో దూడపై దాడి చేసిన పులి అదే ప్రాంతంలో మంగళవారం రాత్రి సంచరించింది. బుధవారం నాటికి అభయారణ్యంలోని మెత్తాపుకోట ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులికి అమర్చిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకర్ ద్వారా అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పులి అడుగుజాడలు గుర్తిస్తున్నారు. పులి కదలికలను బట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొండ కాలువల నీరు, చల్లని గుబురుపొదలు ఉండటంతో ఈ ప్రాంతంలోనే పులి సంచారం జరుగుతోంది. నాలుగు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా నుంచి గోదావరి నది దాటి ఏలూరు జిల్లా పోలవరం మండలంలో ప్రవేశించింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో సంచరిస్తుండటంతో వ్యవసాయ కూలీలు, రైతులు, ఏజెన్సీవాసులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. పులి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి చేరేందుకు మళ్లీ ఈ ప్రాంతంలోకి చేరి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అటవీ శాఖ సబ్ డీఎఫ్‌వో వెంకటసుబ్బయ్య, రేంజ్ అధికారి ఎస్‌కే వలీలు సిబ్బందితో కలిసి గుంజవరం రామన్నపాలెం, వెంకటరెడ్డిగూడెం, మెత్తాపుకోట, ఉడతపల్లి గ్రామాల్లో పులి కదలికలను పరిశీలిస్తున్నారు. ప్రజలు ఒంటరిగా సంచరించవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


