సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు | - | Sakshi
Sakshi News home page

సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు

Jan 19 2026 4:05 AM | Updated on Jan 19 2026 4:05 AM

సుబ్బారాయుడిని  దర్శించుకున్న భక్తులు

సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు

సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు కొల్లేటికోటలో భక్తుల రద్దీ నరసాపురంలో సైబర్‌ మోసం ఏలూరులో బంగారం చోరీ కోళ్ల వ్యర్థాలు తరలిస్తున్న వాహనం సీజ్‌ వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ

ముదినేపల్లి రూరల్‌: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయానికే జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి పుట్టలో పాలు పోసి దర్శించుకున్నారు. మహిళలు పాల పొంగళ్ళశాల వద్ద నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద అధికసంఖ్యలో భక్తులు పూజలు చేశారు. గోకులంలోని గోవులకు మహిళలు పసుపు, కుంకుమతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటు చేశారు. అన్నదానం షెడ్డులో అన్నప్రసాదం కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

కై కలూరు: అమ్మా.. నీ దీవెనలు అందించమ్మా.. అంటూ భక్తులు కొల్లేటికోట పెద్దింట్లమ్మను భక్తితో వేడుకున్నారు. సంక్రాంతి పండగ సెలవులు ముగింపు కావడంతో ఆదివారం సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు. ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పాలపొంగళ్లు సమర్పించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శినాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదం, గధుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల అమ్మకం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.66.321 ఆదాయం వచ్చిందని తెలిపారు.

నరసాపురం: నరసాపురం పట్టణం ఎన్టీఆర్‌ కాలనీలో ఓ మహిళను సైబర్‌ కేటుగాళ్లు మోసం చేశారు. మీషో షాపింగ్‌లో రూ.7.49 లక్షలు గెలుచుకున్నారని నమ్మించి ఆమె బ్యాంకు ఖాతా, ఆధార్‌, పాన్‌కార్డు వివరాలు తీసుకుని ఓటీపీ పంపి ఆమె ఖాతా నుంచి రూ.4 లక్షలు కొట్టేశారు. మోసపోయినట్టు గ్రహించిన నంధ్యాల రాణి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం.. గత నెల 28న బాధిత మహిళ మీషో యాప్‌లో బెడ్‌షీట్స్‌ కొనుగోలు చేసింది. ఈ నెల 1న ఫోన్‌ చేసి లక్కీ డిప్‌ గెలుచుకున్నారని, రూ 7.49 లక్షలు గెలుపొందారని అవతలి వైపు నుంచి ఓ యువతి మాట్లాడింది. ఆధార్‌, పాన్‌ వివరాలు ఇవ్వాలని ఓటీపీ చెప్పాలని సూచించింది. ఆమె మాటలు నమ్మిన రాణి పక్కనున్న ఇంట్లో అమ్మాయితో వివరాలు పెట్టించింది. ముందురోజే దుబాయ్‌లో ఉంటున్న రాణి భర్త శ్రీనివాసరావు స్థానిక బ్యాంకులో ఉన్న అప్పుతీర్చాలని గల్ఫ్‌లో స్నేహితుల వద్ద రూ.4 లక్షలు అప్పు చేసి భార్య ఖాతాలో వేశాడు. ఈ సొమ్మును సైబర్‌ నేరగాళ్లు కొట్టేశారు. ఈ ఘటనపై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ఏలూరు టౌన్‌: ఏలూరు కొమడవోలు ప్రాంతంలోని మహేశ్వర లే అవుట్‌లో ఇంటికి తాళాలు వేసి సంక్రాంతి వేడుకలకు ఊరెళ్లి వచ్చేసరికి తాళాలు పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు బంగారు వస్తువులు చోరీ చేశారు. మహేశ్వర లేఅవుట్‌లో ఉంటున్న పడాల రవితేజ సినీ డిజైనర్‌గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు. ఈ నెల 12న ఇంటికి తాళం వేసి తన కుటుంబంతో రాజమండ్రి వెళ్ళాడు. ఈ నెల 17 సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి చూసుకునేసరికి తాళాలు పగులగొట్టి బీరువాలోని రెండు బంగారు ఉంగరాలు, చెవి దిద్దులు అపహరించుకుపోయారు. బాధితులు ఏలూరు రూరల్‌ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెదపాడు: కోళ్ల వ్యర్థాలను అక్రమ రవాణా చేస్తున్న వాహనం సీజ్‌ చేసి ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పెదపాడు పోలీసులు తెలిపారు. మండలంలోని వీరభద్రపురం గ్రామానికి కోళ్ల వ్యర్థాలు తరలిస్తున్నట్లు సమాచారం మేరకు పెదపాడు పోలీసులు వాహనం అడ్డుకుని వాహనం సీజ్‌ చేసి, కోళ్ల వ్యర్థాలు తరలించడంలో భాగస్వాములైన ముంగర హరిబాబు, యలమంచిలి ప్రసన్నకుమార్‌, తోకల రాంబాబు, కూచిపూడి వాసు, నక్కా నాగమణికంఠ, హైదరాబాదుకు చెందిన సయ్యద్‌ సఫ్రీద్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

దెందులూరు: మండలంలోని సత్యనారాయణపురంలో వృద్ధురాలి మెడలో గొలుసు చోరీకి గురైంది. దెందులూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అపరిచిత వ్యక్తి శనివారం వృద్ధురాలి ఇంట్లో చొరబడి మూడు కాసుల బంగారు గొలుసు లాక్కుని పారిపోయాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఆర్‌.శివాజీ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement