జోరుగా పండుగప్ప సాగు
● తీర ప్రాంతంలో విస్తరిస్తున్న పెంపకం
● ఆసక్తి చూపుతున్న ఆక్వా రైతులు
భీమవరం అర్బన్: జిల్లాలోని తీర ప్రాంతంలో పండు చేప (పండుగప్ప) సాగు విస్తరిస్తోంది. దేశ, విదేశాల్లో ఈ చేపకు గిరాకీ ఉండటంతో ఆక్వా రైతులు ఆసక్తి చూపుతున్నారు. భీమవరం మండలంలో దొంగపిండి, లోసరి, తోకతిప్ప, నాగిడిపా లెం, కొత్తపూసలమర్రు, గూట్లపాడు, వెంప తది తర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వీటిని పెంచుతున్నారు. వైట్ స్పాట్, విబ్రియో, వైట్‌గట్, ఈహెచ్‌పీ తదితర వైరస్‌లతో నాణ్యమైన రొయ్య సీడ్ దొరక్కపోవడంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు పండు చేప సాగువైపు మళ్లుతున్నారు.
ధర ఆశాజనకంగా..
సప్ప, ఉప్పు నీటిలో పెరిగే పండుగప్ప 10 కిలోల వరకు ఎదుగుతుంది. వీటికి ధరలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. కిలో దాటితే రూ.370, 2 కిలోలు దాటితే రూ.460, 4 కిలోలకు పైగా ఉంటే రూ.570 చొప్పున ధర పలుకుతోంది. జిల్లాలోని పండు చేపలను హౌరా, ముంబై, గోవా, కోల్‌కతా, బిహార్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. వీటికి చైనా గొరకలు, చిన్న చేపలను ఆహారంగా వేస్తుంటారు. బతుకున్న చేపలను మాత్రమే వేటాడటం పండుగప్ప ప్రత్యేకత.
చిన్న, సన్నకారు రైతులు మొగ్గు : ఎకరా, రెండెకరాల్లో వనామీ సాగులో నష్టాలు రావడంతో చిన్న, సన్నకారు రైతులు పండుచేప పెంపకానికి ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువగా 3, 4 ఎకరాల విస్తీర్ణంలో వీటిని పెంచుతున్నారు.


