కొండేపాడులో అగ్ని ప్రమాదం
పెంటపాడు: మండలంలోని కొండేపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం మూడు గడ్డి వాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన వార్డు సభ్యులు ఆలపాటి సాంబశివరాజు, బొక్కా గోపయ్య, మరో వ్యక్తికి చెందిన సుమారు 10 ఎకరాల గడ్డి వాములు దగ్ధమయ్యాయి. ఎవరో కాల్చిపారేసిన సిగరెట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. సుమారు రూ.20 వేల నష్టం వాటిల్లిందని స్థనికుల చెబుతున్నారు. వార్డు సభ్యుడు పంపన రాంబాబు చొరవతో అత్తిలి అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించగా వారు మంటలను అదుపు చేశారు.
అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం
పోలవరం రూరల్: అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై సుమారు రూ.6 లక్షల విలువైన ఆస్తి నష్టం వాటిల్లింది. వివరాల ప్రకారం పోలవరం పంచాయతీ పరిధిలోని బెజవాడ వారి వీధిలో నివాసముంటున్న రాచమల్ల భీమరాజు పండుగ సందర్భంగా ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉదయం ఇంట్లో నుండి మంటలు రాగా చుట్టుపక్కల వారు గమనించి భీమరాజుకు, ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. భీమరాజు కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్న సామగ్రి చూడగా పూర్తిగా కాలి బూడిదైంది. షార్ట్ సర్క్యుట్ కారణంగా సంఘటన జరిగిందని గుర్తించారు. అగ్ని ప్రమాదం జరిగిన ఇంటిని తహసీల్దార్ ఆర్‌ఎస్ రాజు పరిశీలించారు.


