
అక్రమార్కులకు భీమవరం
సాక్షి, భీమవరం: పట్టణంలోని 9వ వార్డు చినరంగనిపాలెంలో రూ.కోట్లు ఖరీదు చేసే ఖాళీ స్థలానికి సంబంధించి సరైన రికార్డు లేకుండా వేరొకరి పేరు మీద మున్సిపల్ అధికారులు పన్ను సృష్టించేశారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. స్థల యజమానుల ఫిర్యాదుపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు సరైన పరిశీలన చేయకుండా పన్ను వేసినట్టు తేల్చారు. అందుకు బాధ్యులుగా మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన ఎస్.శివరామకృష్ణ, రెవెన్యూ అధికారి డి.సోమశేఖర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఎస్.కృష్ణమోహన్, వార్డు సెక్రటరీ పి.చంద్రశేఖర్‌లపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశిస్తూ ఏప్రిల్ 17న ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీచేశారు.
కోవిడ్ సమయంలో బాధితులకు వైద్యం సాయం అందించేందుకు గత ప్రభుత్వం పట్టణంలో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటుచేసింది. వీటి నిర్వహణ పేరిట కొందరు మున్సిపల్ అధికారులు అక్రమాలకు తెరలేపారు. కోవిడ్ బాధితులకు సదుపాయాలు కల్పించినట్టుగా నకిలీ బిల్లులు, ఫోర్జరీ సంతకాలతో నిధులను స్వాహా చేశారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు గత ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. రూ.91.06 లక్షలు అవినీతి జరిగినట్టు తాజాగా విచారణలో తేలింది. అవినీతికి పాల్పడిన నాటి మున్సిపల్ కమిషనర్ కె.రమేష్‌కుమార్ (రిటైర్డ్), ఎఫ్1 సీహెచ్ కామేష్‌బాబు, జూనియర్ అసిస్టెంట్ జీవీఎన్ చంద్రశేఖర్, హెల్త్ అసిస్టెంట్ ఎస్.చంటిబాబు, ఏఈలు వీవీఎస్ శివకోటేశ్వరరావు, కె.రాజ్‌కుమార్, కాంట్రాక్టర్లు జీవీ సురేష్, ఏ.భగవాన్‌పై క్రిమినల్ చర్యలకు ఆదేశిస్తూ రెండు రోజుల క్రితం డీఎంఏ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు వారిపై మున్సిపాల్టీ నుంచి పట్టణ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పలు విభాగాల్లో అవినీతి
టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్, శానిటేషన్, పబ్లిక్ హెల్త్ తదితర విభాగాల్లో అవినీతి రాజ్యమేలుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా నిర్మాణాలు చేస్తున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటం, పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన సామగ్రి కొనుగోళ్లు, వాహనాలకు డీజిల్, మెయింటినెన్స్‌లో అవకతవకలు, చేయని పనులకు చేసినట్టుగా బిల్లులు పెట్టుకుని ప్రజాధనాన్ని కాజేయడం, పనుల అంచనాలు పెంచేయడం, వేసవి సందర్భంగా పట్టణ ప్రజలకు ట్యాంకర్లు ద్వారా తాగునీటి సరఫరా పేరిట బయట అమ్మకాలు చేసుకోవడం తదితర అవినీతి వ్యవహారాలపై ఇప్పటికే స్థానికుల నుంచి పలు ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది. అవి వెలుగుచూస్తే మరిన్ని అక్రమాలు బయటపడతాయని అంటున్నారు.
పన్నుల్లో అక్రమాలపై ఇటీవల నలుగురిపై క్రమశిక్షణ చర్యలు
కోవిడ్ నిధుల స్వాహాపై గతంలోనే విచారణకు ఆదేశించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
రూ.98 లక్షలు కాజేసినట్టు తాజాగా తేల్చిన విజిలెన్స్ అధికారులు
ఆరుగురు ఉద్యోగులపై క్రిమినల్ చర్యలకు డీఎంఏ ఆదేశం
పాలకవర్గం లేక పెచ్చుమీరుతున్న అవినీతి
భీమవరం మున్సిపాలిటీ ఘన చరిత్రను కొందరు ఉద్యోగులు తమ అవినీతి వ్యవహారాలతో మసకబారుస్తున్నారు. ప్రత్యేక పాలన, ప్రశ్నించేవారు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని దొరికినకాడికి దోచేస్తున్నారు. 2014లో చివరిగా మున్సిపాల్టీకి ఎన్నికలు జరిగాయి. తర్వాత 2019లో ఎన్నికలు జరగాల్సి ఉంది. పట్టణ సమీపంలోని చిన అమిరం, రాయలం, కొవ్వాడ అన్నవరం, విస్సాకోడేరు, తాడేరు తదితర గ్రామాల విలీన ప్రతిపాధనపై ఆయా గ్రామాల వారు కోర్టుకు వెళ్లడం తదితర కారణాలతో ఎన్నికలు జరగలేదు. నాటి నుంచి ప్రత్యేక పాలన కొనసాగుతోంది. కౌన్సిలర్లు, పాలకవర్గం, సమస్యలపై గళమెత్తే ప్రతిపక్షం లేకపోవడంతో ఉద్యోగుల ఇష్టారాజ్యంగా మారింది. కొందరు ఉద్యోగులు స్థానికంగా పాతుకుపోయారు. రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకుని ఎక్కడికి బదిలీ అయినా వారి సిఫార్సులతో తిరిగి ఇక్కడ వాలిపోతున్నారు. వారి అండదండలతో ‘లోకల్’ అంటూ పెత్తనం చెలాయిస్తూ పై అధికారుల ఆదేశాలను ఖాతరుచేయడం లేదని తెలుస్తోంది.