
లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి
ఏలూరు (టూటౌన్): కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీఎన్‌వీడి ప్రసాద్, ఏఐటీయూసీ అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస, ఐఎఫ్‌టీయు నాయకుడు గడసాల రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే విడనాడాలని డిమాండ్ చేశారు. జూలై 9న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో పాల్గొని నిరసన తెలియజేయాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలను కార్పొరేట్లకు, ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా మోదీ ప్రభుత్వం అప్పగిస్తుందని వారు తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, బి.సోమయ్య, వీవీఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.