
ధాన్యం బకాయిలు చెల్లించాలి
ఏలూరు (టూటౌన్): జిల్లాలో రైతులు, కౌలు రైతులకు చెల్లించాల్సిన రబీ ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించి అన్నదాతలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ కోరారు. స్థానిక అన్నే భవనంలో ధాన్యం బకాయిల సమస్యలపై మంగళవారం ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చివరి దశలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి దాదాపు రూ.89 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. గత 15 రోజులుగా ధాన్యం సొమ్ములు చెల్లింపులు నిలిచిపోవడంతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రబీ పంటకు తెచ్చిన పెట్టుబడి అప్పులు తీర్చి ఖరీఫ్ సాగుకు సన్నద్ధం కావాల్సిన దశలో ధాన్యం బకాయిలు చెల్లించకపోవడం తగదన్నారు. చివరి దశలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బకాయిలు కూడా చెల్లించి ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ధాన్యం సొమ్ము అందాల్సిన బైరెడ్డి లక్ష్మణరావు మాట్లాడుతూ ఏలూరు శివారు సుంకరి వారి తోటకు చెందిన తనకు గత 15 రోజులు క్రితం తోలిన ధాన్యానికి సొమ్ములు అందలేదన్నారు. ధాన్యం బకాయిలు చెల్లించి ఆదుకోవాలని కోరారు.