
మెరుగైన చికిత్స అందించాలి
నరసాపురం రూరల్: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఆస్పత్రుల్లోనే మెరుగైన పరీక్షలు, చికిత్స అందించాలని, గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవించేలా వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం నరసాపురం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఓపీ రిజిస్టర్లు, పలు విభాగాలను, వైద్య సేవలందించే వార్డులు పరిశీలించారు. అనంతరం డీసీహెచ్‌ఎస్, ఆసుపత్రి కమిటీ సభ్యులు, వైద్యాధికారులతో మాట్లాడుతూ సిబ్బంది పనితీరు, ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు, ఆసుపత్రిలో జరుగుతున్న ఆపరేషన్లు వంటి విషయాలపై చర్చించారు. అనంతరం రుస్తుంబాద అలంకృతి లేసు పార్కును కలెక్టర్ సందర్శించారు. అక్కడ మహిళలు అల్లిన పలు విధాల లేసు డిజైన్లను పరిశీలించారు. లేసు అల్లికలతో మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా పయనించాలని అన్నారు. అనంతరం మండలంలోని స్వయం సహాయక గ్రూపులు నిర్వహిస్తున్న యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు. లక్ష్మణ్వేశ్వరంలో పిండి వంటలు తయారీ యూనిట్, సార్వలో మినీ డైరీ యూనిట్, తూర్పుతాళ్లలో ఫ్లోర్ మిల్లు, పచ్చళ్ళు తయారు చేసే యూనిట్, చామకూరిపాలెంలో డొక్క తాడు పరిశ్రమను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆయా యూనిట్‌లను నడిపే సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.