
పాపాలు కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం తంటాలు
తాడేపల్లిగూడెం అర్బన్: టీటీడీ గోశాలలోని గోవులు మరణిస్తే.. అబద్ధమంటూనే చివరకు మరణాలను అంగీకరించారని తమ పాపాలు కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం తంటాలు పడుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. టీటీడీ చైర్మన్ గోవుల మృతి పట్ల అవాస్తవాలు చెప్పడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బ తీశారన్నారు. దేవస్థానం ఈఓ శ్యామలరావు తన బాధ్యతలను పక్కనబెట్టి టీడీపీ సభ్యుడిగా ఆ పార్టీ అజెండా మోస్తున్నట్లు ఉందని విమర్శించారు. గోశాలలో గోవుల మృతిపై 22 గోవులు అని ఒకసారి, 40 గోవులు అని మరోసారి చెప్పారని.. చివరకు ఆలయ ఈఓ 43 గోవులు మృతిచెందాయని చెప్పారన్నారు. గోవులు మృతి చెందితే ఆందోళన ఎందుకని దేవస్థానం నిర్వాహకులు వ్యాఖ్యానించడం శ్రీవారి సేవల పట్ల వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. శ్రీవారి పవిత్ర ప్రసాదమైన లడ్డూలో జంతు కొవ్వు అవశేషాలు కలుస్తున్నాయని ఆరోపణలు చేస్తూ భక్తులను మనోవేదనకు గురి చేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని, అయినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని విమర్శించారు. టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలు వైఎస్సార్‌సీపీకి ముడిపెడుతూ వైఎస్ జగన్‌మోహనరెడ్డిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుకు ప్రజలు మళ్లీ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇప్పటికీ తన మోసపూరిత నైజాన్ని విడవలేకపోతున్నాడని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా శ్రీవారి నవనీత సేవకు 40 గిరి ఆవులతో కలిపి 550 గోవులను కొనుగోలు చేసి వెన్న నైవేద్యానికి ఏర్పాటు చేశామని కొట్టు సత్యనారాయణ చెప్పారు.
అబద్ధమంటూనే గోవుల మరణాలు అంగీకరించారు
మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ