పోటెత్తిన శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రం శనివారం భక్తులు, పెళ్లి జనాలతో పోటెత్తింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ విద్యార్థులకు సెలవులు కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం క్షేత్రంలోను, వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వివాహాలు జరగడంతో నూతన వధువరులు, వారి బంధువులు ఆలయానికి వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. దాంతో ఆలయ పరిసరాలు భక్తులు, పెళ్లి జనాలతో కిటకిటలాడాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల ఇతర విభాగాలు రద్దీగా మారాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో ఈ రద్దీ కొనసాగింది. ఆదివారం క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అసభ్యకర ప్రవర్తనపై
కేసు నమోదు
భీమవరం: మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై రెహమాన్ శనివారం చెప్పారు. రాయలం గ్రామంలో ఉంటున్న కొక్కట్టి రాములు తన భర్త చనిపోవడంతో ఇళ్లలో పనిచేసుకుని జీవిస్తోంది. ఈనెల 11న ఇళ్లలో పనిముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. అదే గ్రామానికి చెందిన కుమార్, అతని స్నేహితుడు ఆమెను అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించారు. రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై రెహమాన్ చెప్పారు.


