ధర్మసాగర్: ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డిని వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సోమవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం, స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎంతో చర్చించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిఽఽధిలో చేపట్టాల్సిన కీలక అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం, ప్రజలకు అవసరమైన వివిధ అభివృద్ధి పనులకు నిధుల మంజూరు తదితర అంశాలను ఎంపీ కావ్య సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఘన్‌పూర్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజల అవసరాలు, పెండింగ్ సమస్యలు, వివిధ ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై ఎమ్మెల్యే కడియం ముఖ్యమంత్రితో చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని కోరారు. కాగా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారని వారు తెలిపారు.
పాకాలలో కనిపించిన
గ్రే హెడెడ్ ఫిష్ ఈగల్
ఖానాపురం: మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో సోమవారం గ్రే హెడెడ్ ఫిష్ ఈగల్ పక్షి దర్శనమిచ్చింది. అనేక రకాల పక్షులకు నిలయమైన పాకాలలో చాలాకాలం తర్వాత ఈ గద్దజాతి పక్షి కనిపించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇది ప్రధానంగా సరస్సులు, రిజర్వాయర్లు, నదులు, చిత్తడి నేలల సమీపంలో నివసిస్తుంది. దీని ప్రధాన ఆహారం చేపలు. నీటి ఉపరితలంపై ఈదుతున్న లేదా తేలుతున్న చేపలను గమనించి నీటి మీదికి వేగంగా దూసుకువచ్చి తన కాళ్లతో బలంగా ఒడిసిపడుతుంది. అప్పుడప్పుడు ఉభయచరాలు, జంతు కళేబరాలను కూడా తింటుంది. నీటి ఒడ్డున ఉండే పెద్ద చెట్లకొమ్మలపై గంటల తరబడి నిశ్శబ్దంగా కూర్చొని వేట కోసం నిరీక్షిస్తుంది. దీనిని బేస్‌క్యాంప్ సిబ్బంది ప్రకాశ్ తన కెమెరాలో బంధించారు.
‘మీ ప్రమాణం’ యాప్ షురూ
కాశిబుగ్గ: ఇకపై వేళాపాళా లేకుండా విధులకు హాజరయ్యే సిబ్బందికి చెక్ పడనుంది. కొందరు అధికారులతో పాటు సిబ్బంది సైతం ఇష్టారీతిన విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలు ఇక రావు. ఆన్‌లైన్ పర్యవేక్షణ ద్వారా సిబ్బంది వివరాలు తక్షణమే తెలిసిపోనుంది. సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ కచ్చితంగా తెలుసుకోవడానికి మీ ప్రమాణం యాప్ ఉపయోగపడనుంది. ఎంజీఎంలో సోమవారం నుంచి ‘మీ ప్రమాణం యాప్’ అమల్లోకి వచ్చింది. ఆస్పత్రిలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ వైద్య సిబ్బంది దాదాపు 1200 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి వీరంతా తమకు కేటాయించిన సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫోన్‌లో ఫేస్ రికగ్నేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లీవ్స్ కావాలన్నా ఈ యాప్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది. ఆలస్యంగా వచ్చినా, సెలవులు పెట్టినా నిబంధనల ప్రకారం సాలరీ కట్ చేయనున్నట్లు సమాచారం.
విద్యావకాశాలు
కల్పించేందుకు చర్యలు
కాళోజీ సెంటర్: ‘టాస్’ అడ్మిషన్ల లక్ష్యాలను నిర్దేశిత గడువులోపు పూర్తిచేసి అర్హత గల ప్రతీ అభ్యర్థికి విద్యావకాశాలు కల్పించేందుకు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం సూచించారు. టాస్ అడ్మిషన్ల ప్రక్రియపై మండల సమాఖ్య డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్మిషన్, ఆన్‌లైన్ నమోదు విధానం, అవసరమైన పత్రాల అప్‌లోడ్, అడ్మిషన్లు సమర్థవంతంగా పూర్తిచేసే విధానంపై సమగ్ర శిక్షణ అందించారు. కార్యక్రమంలో ఏపీఎం రాజు, వరంగల్, హనుమకొండ జిల్లాల టాస్ / ఉల్లాస్ కోఆర్డినేటర్లు నాగేశ్వర్‌రావు, చల్లా రాజిరెడ్డి పాల్గొన్నారు.


