తొలగించండి.. మహాప్రభో
● వరంగల్ లేబర్ కాలనీలోని 18వ డివిజన్‌లో 16–12–97/1 ఇంటి నంబర్‌కు నల్లా లేదు. కానీ, బిల్లు రూ.12వేలు ఉంది. బిల్లు మాఫీ చేయాలని యజమాని మాధవి పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఇంజనీర్లు పట్టించుకోవడం లేదు.
● వరంగల్ చింతల్‌లోని 16–11–371/1 ఇంటి నంబర్‌లో నల్లా కనెక్షన్ లేకున్నా రూ.7వేల బిల్లు వేశారు. బిల్లు రద్దు చేయాలని మహ్మద్ రజీయొద్దీన్ అధికారులను కోరారు.
● రంగశాయిపేటలోని 19–9–449/2 ఇంటి నంబర్‌కు రెండు నల్లాలు ఉన్నాయి. ఒకదానిని తొలగించాలని దొడ్డ శ్రీనివాస్ పలుమార్లు ఇంజనీర్లను వేడుకున్నా స్పందించడం లేదు. బకాయి చార్జీలు నెలనెల వస్తున్నాయి.
● నల్లా కనెక్షన్ లేదు. బిల్లు రూ.7,200 వేశారని హనుమకొండ లష్కర్‌బజార్‌కు చెందిన విజయలక్ష్మి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదు.
● గుండ్లసింగారంలో 39–1–18 ఇంటి నంబర్‌కు నల్లా కనెక్షన్ లేకున్నా బిల్లు వస్తోందని మినహాయించాలని రవీందర్‌రెడ్డి కోరారు.
వరంగల్ అర్బన్: ఒకవైపు నల్లా మీటర్లు లేని వాణిజ్యసంస్థలు, అపార్ట్‌మెంట్లు, మరోవైపు అక్రమ కనెక్షన్లతో గ్రేటర్ వరంగల్ ఆదాయానికి గండి కొడుతున్న జలగలను చూసీచూడనట్లుగా విడిచిపెడుతున్న ఇంజనీర్లు.. ఇంకో వైపు లేని నల్లాలకు మాత్రం బిల్లులు పంపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నాడు మెప్మా రిసోర్స్ పర్సన్స్ (ఆర్పీలు) చేసిన తప్పిదాలు సరిచేసుకోకుండా.. వారు అనుకున్నదే తడవుగా బిల్లులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు.
తప్పు ఎక్కడ జరిగింది?
కొందరు ఆర్పీలు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఉన్నా లేనట్లుగా బల్దియా వెబ్‌సైట్‌లో నల్లా కనెక్షన్లు నమోదు చేశారు. నల్లా కనెక్షన్ అసలే తీసుకొని ఇంటి నంబర్లకు, నల్లా ఉన్నప్పటికీ అదనపు కనెక్షన్ జోడించారు. ఇళ్లకే కాదు అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లకు నల్లా కనెక్షన్లు ఉన్నట్లు చూపడం దారుణం. దీంతో నగర వ్యాప్తంగా సుమారు 8వేల ఇళ్లకు అదనపు కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. ఈవిషయమై బల్దియా ఎస్‌ఈ రాజ్‌కుమార్‌ను వివరణ కోరగా విచారణ చేసి నల్లా కనెక్షన్లను రద్దుచేస్తామని పేర్కొన్నారు.
గ్రేటర్ వరంగల్ నగరంలో నల్లా లేకున్నా బిల్లులు!
నాటి తప్పులతో నగర ప్రజలకు తప్పని ఇబ్బందులు
తొలగించాలని బల్దియా గ్రీవెన్స్‌లో వేలాది ఫిర్యాదులు
పట్టించుకోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఉన్నతాధికారులు
నల్లా కనెక్షన్ ఇవ్వకముందే, నల్లా లేకున్నా, ఒక ఇంటికి ఒక కనెక్షన్ ఉండగా, అదనపు కనెక్షన్ ఇలా.. లేని నల్లాలకు బిల్లులు మంజూరు చేశారని తొలగించండి మహాప్రభో అంటూ వినియోగదారులు బల్దియా ప్రధాన కార్యాలయం గ్రీవెన్స్‌లో ప్రతి వారం పెద్ద ఎత్తున దరఖాస్తులు అందిస్తున్నారు. గతంలో ఉన్న నల్లా కనెక్షన్, అదనపు నల్లా, లేని నల్లాలకు బిల్లులు చేస్తే తొలగిస్తామని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. అయినప్పటికీ కొంతమంది ముందుకొచ్చి బిల్లులు చెల్లించినా కూడా రద్దు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. కానీ, బల్దియా ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో విచారణ చేయడంలో తాత్సరం చేస్తున్నారు. లేని కనెక్షన్లు తొలగించాలని సుమారు 4వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రతి నెల నల్లా బిల్లు రూ.150 చొప్పన పెరిగి తడిసిమోపెడవుతోంది.


