పనితీరే కొలమానం | - | Sakshi
Sakshi News home page

పనితీరే కొలమానం

Aug 31 2026 1:50 AM | Updated on Aug 31 2026 1:50 AM

పనితీరే కొలమానం

నైపుణ్యాల పెంపునకు శిక్షణ

సాంకేతిక నైపుణ్యంతో మెరుగైన సేవలు

హన్మకొండ: వినియోగదారులకు మరింత నాణ్యమైన, విశ్వసనీయమైన విద్యుత్‌ సేవలను అందించడంతో పాటు సంస్థ పనితీరును మరింత మెరుగుపర్చేందుకు టీజీ ఎన్పీడీసీఎల్‌ సమగ్ర చర్యలు చేపట్టింది. ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ మార్గదర్శకత్వంలో ఉద్యోగుల సమర్థవంతమైన పనితీరు, నాణ్యతా ప్రమాణాలకు కొలమానం విధించారు. వంద మార్కుల పనితీరుకు ప్రోత్సాహం అందించనున్నారు. టీజీ ఎన్‌న్పీడీసీఎల్‌లోని సెక్షన్ల పనితీరును మరింత పారదర్శకంగా కొలిచే విధంగా అంచనా వేయడానికి వంద మార్కుల ఆధారిత ఉద్యోగుల పనితీరు నిర్వహణ వ్యవస్థ అమలు చేసున్నారు. సంస్థ ప్రాధాన్యతలకు అనుగుణంగా వివిధ అంశాలకు మార్కులు కేటాయించి, వాటి ఆధారంగా సెక్షన్లకు ర్యాంకులు, గ్రేడ్లు నిర్ణయిస్తున్నారు. కొత్త సర్వీసుల విడుదల, రెవెన్యూ వసూళ్లు, పెండింగ్‌ వర్క్‌ ఆర్డర్ల ముగింపు, ట్రాన్‌న్స్‌ఫార్మర్‌ వైఫల్యాల నియంత్రణ, ట్రాన్‌న్స్‌ఫార్మర్ల నిర్వహణ, ఎనర్జీ ఆడిట్‌, నష్టాల తగ్గింపు, సైది, సైఫీ, నిలిపివేతకు సంబంధించిన తనిఖీలు, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, కాలిపోయిన, పనిచేయని మీటర్ల మార్పిడి, బిల్‌స్టాప్‌ తనిఖీల వంటి అంశాలు, పనితీరును పరిగణనలోకి తీసుకుంటున్నారు. పనితీరు అంచనాలో ప్రస్తుత ఫలితాలతోపాటు గత నెలతో పోలిస్తే సాధించిన పురోగతికి కూడా అదనపు మార్కులు ఇవ్వడం ఈ విధానంలో ప్రత్యేకత. దీంతో వెనుకబడిన సెక్షన్లు కూడా తమ పనితీరును క్రమంగా మెరుగుపర్చుకునే అవకాశం కలుగుతుందని యాజమాన్యం భావిస్తోంది.

ఉద్యోగులు తమ ర్యాంకు స్కోర్‌ గ్రేడ్‌తో పాటు ఏ అంశంలో మార్కులు తగ్గాయో, గత నెలతో పోలిస్తే పనితీరు ఎలా ఉందో తెలుసుకునేలా ఉద్యోగుల పనితీరు మూల్యాంకన డ్యాష్‌ బోర్డ్‌ అందుబాటులో ఉంచుతారు. బలహీనంగా ఉన్న అంశాలను గుర్తించి, వాటిపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన ర్యాంకు సాధించేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాలను పెంపొందించేందుకు మాస్టర్‌ శిక్షకులచే శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. అకౌంట్స్‌, రెవెన్యూ, టెక్నికల్‌, ఆపరేషన్‌, నిర్వహణ, సేఫ్టీ, స్టోర్స్‌, కమర్షియల్‌, బెస్ట్‌ ప్రాక్టీసెస్‌, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌న్‌, సివిల్‌ విభాగాలకు శిక్షణ కార్యక్రమాలను యాజమాన్యం రూపొందించింది. క్వాలిటీ కంట్రోల్‌ విభాగం ద్వారా క్షేత్రస్థాయిలో చేపట్టిన విద్యుత్‌ పనుల నాణ్యతను నిరంతరం తనిఖీ చేసేలా, ఎర్తింగ్‌, జంపర్‌ బైండింగ్‌, ఫ్యూజ్‌ వైర్‌ తదితర పునరావృత లోపాలను తగ్గించేందుకు కామన్‌ ఫీల్డ్‌ చెక్‌లిస్ట్‌ విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందించారు.

ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధికి టీజీ ఎన్పీడీసీఎల్‌ చర్యలు

పలు అంశాలకు మార్కులు.. సెక్షన్లకు ర్యాంకులు, గ్రేడ్లు

ఆధునిక అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలు

సాంకేతికంగా నైపుణ్యం కలిగిన మానవవనరులను తయారు చేయడం ద్వారా వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ సేవలు అందుతాయి. ఉద్యోగుల పనితీరు మెరుగుదల, క్షేత్రస్థాయి పనుల నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, వినియోగదారులకు పారదర్శక సేవల కోసం వంద మార్కుల విధానం తీసుకొచ్చాం. తద్వారా విద్యుత్‌ అధికారులు, ఉద్యోగులు పోటీతత్వంతో మరింత మెరుగైన సేవలు అందిస్తారు. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది.

– కర్నాటి వరుణ్‌రెడ్డి, టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement