● వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత
● ముగిసిన భద్రాద్రి జోన్ పోలీస్ డ్యూటీ మీట్ –2026
మామునూరు: డ్యూటీ మీట్‌ల ద్వారా వృత్తి నైపుణ్యాల్లో ప్రతిభ కనబరచాలని, కఠోర సాధన చేస్తే అన్ని రంగాల్లో రాణించడంతోపాటు విధి నిర్వహణలోఎదురయ్యే పని ఒత్తిళ్లు అధిగమించొచ్చని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. మామునూరు పోలీస్ శిక్షణ కళాశాల పరేడ్ గ్రౌండ్‌లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి జోనల్ పోలీస్ డ్యూటీ మీట్–2026 గురువారం సాయంత్రం ముగిసింది. ఈ డ్యూటీ మీట్‌లో జోనల్ పరిధిలోని వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లతోపాటు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పోలీసులు అధికారులు కంప్యూటర్ పరిజ్ఞానం, ఫొరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, లిప్టింగ్ అండ్ ప్యాకింగ్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషన్, ఫొటో, వీడియో గ్రాఫిక్ విభాగాల్లో పోటీ పడ్డారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి సీపీ ఎన్.శ్వేత పతకాలు అందజేశారు. కమిషనరేట్ విభాగానికి 13 గోల్డ్ మెడల్స్ సహా మొత్తం 28 పతకాలు వచ్చాయి. అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 12, మహబూబాబాద్ జిల్లా 13, ఖమ్మం కమిషనరేట్ 9 పతకాలు సాధించాయి. ఇందులో రాణించిన పోలీస్ అధికారులు త్వరలో మల్కాజిగిరి కమిషరేట్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో పాల్గొంటారు. సీపీ శ్వేత మాట్లాడుతూ జోనల్ స్థాయిలో కనబరిచిన ప్రతిభనే రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచాలన్నారు. అదనపు డీసీపీలు శ్రీనివాస్, బాలస్వామి, ఏసీపీలు, సురేంద్ర, డీఎస్పీలు శ్రీనివాస్, సాంబరాజు, ఆర్‌ఐ సతీశ్, ఇన్‌స్పెక్టర్లు క్రాంతికుమార్, విశ్వేశ్వర్, విజయ్‌కుమార్, ఆర్‌ఎస్సై శ్రవణ్‌కుమార్ ఉన్నారు.


