ఖిలా వరంగల్: రైతులు పండించే సన్నధాన్యానికి సరైన ధర, సకాలంలో బోనస్ అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. విత్తనం కొనుగోలు చేసినప్పుడే పంటల సాగు లెక్కలు తేల్చేలా చర్యలు చేపట్టింది. సాధారణంగా పంట చేతికి వచ్చిన తర్వాత అది ఏరకమో తేల్చడం అధికారులకు కష్టంగా మారుతోంది. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మార్పులు చేసింది. రైతులు దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేసిన వెంటనే ఆవివరాలను విత్తన డీలర్లు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో ఈసారి బోనస్ చెల్లించేందుకు ప్రకటించిన ఏడు రకాల సన్నరకాల విత్తనాలను ఆన్‌లైన్ చేస్తున్నారు. జిల్లాలో ఈ వానాకాలంలో 1,30,000 ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా లక్ష ఎకరాలకే వరి పంట పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం బోర్లు, బావుల కింద 24 వేల ఎకరాల్లో వరినాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
సన్నరకాల విత్తనాలు
ఎక్కడ కొనుగోలు చేసినా..
జిల్లాకు చెందిన రైతులు రాష్ట్రంలో ఎక్కడ విత్తనాలు కొనుగోలు చేసినా ఆవివరాలను సంబంధిత జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయానికి పంపిస్తారు. దీంతో సన్నరకం విత్తనాల సాగు విస్తీర్ణం తెలియనుంది. సన్నరకం విత్తనాల కొనుగోలు నమోదును సక్రమంగా చేస్తున్నారా లేదా అని మండలాల ఏఓలు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే రైతులు కొనుగోలు చేసిన సన్నరకం విత్తనాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. విత్తనాలు కొనుగోలు చేసినప్పుడే ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలను ఏఈఓలు పంటల నమోదు సమయంలో సరిచేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆన్‌లైన్‌లో నమోదు చేయని రైతులు బోనస్‌కు దూరమయ్యే పరిస్థితి ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. నూతన విధానంతో రైతులకు, అధికారులకు మేలు కలుగుతుందని, విత్తన వ్యాపారులు ప్రతి అమ్మకాన్ని ఆన్‌లైన్ చేయడంతో సాగు వివరాలు పారదర్శకంగా ఉంటాయని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.
సొంత విత్తనాలు ఉపయోగిస్తే..
ప్రభుత్వం సూచించిన ఏడింటిలో ఏ రకం సొంత విత్తనాలు వాడుతున్నారో సంబంధిత ఏఈఓ వద్దకు వెళ్లి పంట వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ చేయకుంటే భవిష్యత్‌లో ప్రభుత్వం బోనస్ చెల్లించడం కష్టమేనని అధికారులు వివరిస్తున్నారు. తప్పనిసరిగా ఏఓలు లేదా ఏఈఓలను కలిసి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.
24,000 ఎకరాల్లో నాట్లు
ఆన్‌లైన్‌లో సన్నవడ్ల పంట వివరాలు నమోదు చేస్తున్న అధికారులు
వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో ఈసారి తగ్గనున్న వరిసాగు విస్తీర్ణం
ప్రస్తుతం బోర్లు, బావుల కింద నాట్లు
వేసేందుకు రైతుల ఏర్పాట్లు


