చెన్నారావుపేట: గ్రామాల్లో భూముల రీసర్వేకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని, ఈ సర్వేకు రైతులు సహకరించాలని జిల్లా సర్వే ఏడీ శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు గురువారం తిమ్మరాయినిపహాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో భూ సమస్యలకు పరిష్కారం చూపాలనే లక్ష్యంతోనే ఈ రీసర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినట్లు పేర్కొన్నారు. మండల పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా తిమ్మరాయినిపహాడ్, జల్లి, అక్కల్‌చెడ, లింగాపురం, కోనాపురం గ్రామాలను ఎంపిక చేసినట్లు వివరించారు. అనంతరం రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి పలు సూచనలు చేశారు. తహసీల్దార్ అబీద్‌అలీ, సర్పంచ్ రమేష్, ఆర్‌ఐ మమత, కార్యదర్శి రాంబాబు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కులాల పేర్లలో మార్పులు గమనించాలి : కలెక్టర్
న్యూశాయంపేట: ప్రభుత్వం సవరించిన బీసీల్లోని కొన్ని కులాల పేర్లను గమనించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రూప్–ఏ కేటగిరీ సీరియల్ నంబర్–7లో ఉన్న డొమ్మర పేరును తొలగించి గడవంశీయ, సీరియల్ నంబర్ 18లో ఉన్న పిచ్చిగుంట్లను తొలగించి వంశరాజ్‌గా సవరించినట్లు ఆమె తెలిపారు. సీరియల్ నంబర్–4లో ఉన్న బుడబుక్కలకు శివక్షత్రియ, 23లో ఉన్న వీరభద్రీయ (వీరముష్టి లేదా నెట్టికోటల)గా సవరించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత అభ్యర్థుల అభ్యర్థన మేరకు వీరభద్రీయ, వీరముష్టి లేదా నెట్టికోటల పేర్లతో కుల ధ్రువీకరణ పత్రాలు జారీచేయనున్నట్లు వవరించారు. ఈ మార్పు కులం పేరుకు మాత్రమేనని, సంబంధిత కులాల రిజర్వేషన్ వర్గీకరణ హక్కులు, ప్రయోజనాల్లో ఎటువంటి మార్పు లేదని ఆమె స్పష్టం చేశారు.
రాష్ట్రస్థాయి పోటీలకు
జల్లి విద్యార్థి ఎంపిక
చెన్నారావుపేట: నర్సంపేట మినీ స్టేడియంలో ఈనెల 8న జిల్లాస్థాయి ఆట్యాపాట్యా అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆట్యాపాట్యా క్రీడా పోటీలు నిర్వహించారు. అండర్–14లో జల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి జరుపుల శివ అత్యుత్తమ ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు పెద్ది వెంకటేశ్వరరావు తెలిపారు. ఈనెల 11,12 తేదీల్లో సిద్దిపేటలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో శివ పాల్గొంటారని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ భిక్షపతినాయక్ తెలిపారు. ఈ సందర్భంగా శివను ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ ఈర్యా, ఉపాధ్యాయులు అనిత, సుభాష్, అశోక్, శ్రీనివాస్, కుమారస్వామి తదితరులు అభినందించారు.
అద్దెకిస్తామని చెప్పి..
కార్లు తాకట్టు
ఖిలా వరంగల్: కార్లను తాకట్టు పెట్టి రూ.లక్షలు కాజేసిన ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ కర్రె స్వామి తెలిపారు. గురువారం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. తన కారును ఐటీ కంపెనీలో అద్దెకు పెట్టానని, నెలకు రూ.35 వేలు అద్దె వస్తోందని, వరంగల్ కరీమాబాద్‌కు చెందిన సింగారపు శ్యాంకుమార్.. ఖిలా వరంగల్ మధ్యకోటకు చెందిన మొహమ్మద్ సోహైల్‌ను నమ్మించాడు. సోహైల్ తన కారును శ్యాంకు అప్పగించగా.. శ్యాం అడ్వాన్స్ కింద రూ.35 వేలు చెల్లించాడు. అనంతరం కారును శ్యాంకుమార్ వేరే వారి దగ్గర తాకట్టు పెట్టి రూ.లక్షలు కాజేశాడు. ఈవిషయమై బాధితుడు మొహమ్మద్ సొహైల్ పోలీసులను ఆశ్రయించాడు. వరంగల్ తెలంగాణ జంక్షన్ వద్ద గురువారం ఉదయం వాహన తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న సింగారపు శ్యాంకుమార్, భద్రాద్రి కొత్తగూడేనికి చెందిన ఎండీ సోహైల్(మరో నిందితుడు)ను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఘరానా మోసం బయటపడింది. వారు ప్రయాణిస్తున్న మారుతి డిజైర్ కారుతోపాటు చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద దాచిన మరో రెండు కార్లు (మారుతి ఎర్టిగా, మారుతి బెలెనో), మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ స్వామి తెలిపారు.


