● ఓపెన్‌ప్లాట్లలో డ్రెయినేజీ నీరు నిలిచి ప్రజలకు తప్పని ఇబ్బందులు
● పట్టించుకోని నర్సంపేట,
వర్ధన్నపేట మున్సిపాలిటీల అధికారులు
నర్సంపేట: మున్సిపాలిటీల్లోని నివాస ప్రాంతాల మధ్య ఖాళీ స్థలాలు మురికి కూపాలుగా మారుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే ఆయా స్థలాల్లో నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. ప్రతీ సంవత్సరం కాలనీల ప్రజలు ఖాళీ స్థలాలతో ఎదురవుతున్న సమస్యలపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. కానీ, తూతూమంత్రంగా ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇస్తున్నారే తప్ప తిరిగి వాటిపై పట్టింపు లేకుండా వ్యవహరిస్తుండడం షరా మామూలుగా మారింది. అపరిశుభ్రతకు కారణమవుతూ చిట్టడవిని తలపిస్తున్నాయి. ఏపుగా పిచ్చిమొక్కలు, చెట్లు పెరగడంతో వాటి చుట్టూ నివాసం ఉన్న ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాకాలంలో డ్రెయినేజీ నీరు, వర్షపు నీరు ఖాళీ ప్లాట్లలో నిలిచి అపరిశుభ్రత ప్రాంతాలుగా నిలుస్తున్నాయి. దోమలు వ్యాప్తి చెందడం, పందులు, విష పురుగులకు నిలయంగా మారి దుర్వాసన వెదజల్లుతుండడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రతీ ఏడాది ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉండగా సుమారు 65 వేల జనాభా ఉంటుంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నర్సంపేటలో ఖాళీ ప్లాట్లు 10 వేల వరకు ఉంటాయి. నీటి నిల్వపై ప్రతీ ఏడాది 250 నుంచి 300 వరకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 14 ఫిర్యాదులు అందినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఇక వర్ధన్నపేట మున్సిపాలిటీలో 12 వార్డుల్లో 16వేల జనాభా ఉంటుంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న వర్ధన్నపేటలో ఖాళీ ప్లాట్లలో నీరు నిలిచిన సమస్యలు ఎదురవుతున్నాయి. భవిష్యత్ అవసరాల కోసం జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో చాలా మంది ఇళ్ల స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. కానీ, వాటి నిర్వహణ పట్టించుకోవడం లేదు. దీంతో ఏళ్ల తరబడి వృథాగా మారి మురికి కూపాలుగా తయారవుతతున్నాయి. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు స్పందించి ఖాళీ ప్లాట్లలో నీరు నిల్వ ఉండకుండా తగిన చర్య తీసుకోవాలని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం..
మునిసిపాలిటీ పరిధిలో ఖాళీ ప్లాట్లు ఉండి అందులో నీరు నిలవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే కొంత మంది సిబ్బందిని ఆ ప్లాట్ల వివరాలను సేకరించేందుకు కేటాయించాం. ఖాళీ ఫ్లాట్ల యజమానులు నీరు నిల్వకుండా లెవల్ చేసుకోవాలి. ఇక నుంచి నిర్లక్ష్యం వహిస్తే నోటీసులు ఇవ్వడంతో పాటు చర్యలు తీసుకుంటాం. ఈ వర్షాకాల సీజన్‌లో సమస్యలు ఎదురు కాకుండా తగిన చర్యలు తీసుకుంటాం.
– కాటం భాస్కర్,
నర్సంపేట మున్సిపల్ కమిషనర్
మున్సిపాలిటీల వివరాలు..
మున్సిపాలిటీ వార్డులు జనాభా
నర్సంపేట 30 65 వేలు
వర్ధన్నపేట 12 16 వేలు


