పూర్తయినవి387 | - | Sakshi
Sakshi News home page

పూర్తయినవి387

Apr 16 2026 9:48 AM | Updated on Apr 16 2026 9:48 AM

జిల్లాలో నెమ్మదించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు

సాక్షి, వరంగల్‌: జిల్లాలో తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ విషయంలో గృహ నిర్మాణ విభాగాధికారుల ఉదాసీనతతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌పై ఉంచిన నమ్మకం మసకబారుతోంది. జిల్లాలో 9,374 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైతే వాటిలో కేవలం 387 ఇళ్లు మాత్రమే ఇప్పటివరకు పూర్తయ్యాయి. విచిత్రమేమిటంటే ఇంకా ప్రారంభానికి నోచుకొని 3,534 ఇళ్లు ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. లబ్ధిదారులను ముందుకు ప్రోత్సాహించాల్సిన ఎంపీడీఓ, పంచాయతీ సిబ్బంది కూడా మీనమేషాలు లెక్కిస్తుండడంతో ఇళ్ల నిర్మాణంలో అంతగా పురోగతికానరావడం లేదు. అలాగే, పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపికై న గ్రామాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాల్లో అనుకున్నంత వేగంగా లేకపోవడం గమనార్హం. దీనికితోడు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఎక్కువగా పేదలు కావడం, వారికి మహిళా సంఘాల నుంచి రుణాలు ఇప్పించడంలో అధికారులు చొరవ తీసుకోకపోవడంతో ఇళ్ల నిర్మాణాల్లో వేగం నెమ్మదించింది. అప్పులు తెచ్చి మరీ కట్టినా తీరా సమయానికి బిల్లులు రాకపోతే మరింత అప్పుల ఊబిల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి ఉంటుందని ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీన్ని ఆదిలోనే గుర్తించిన ప్రభుత్వం.. మహిళా సంఘాల నుంచి రుణాలు ఇప్పించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగిరం చేయాలని గృహ నిర్మాణ విభాగాధికారులకు సూచించినా క్షేత్రస్థాయిలో మాత్రం వాళ్లు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుండడం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ వెనుకబాటుకు కారణమవుతోందన్న చర్చ ఉంది. అసలు సమస్యను గుర్తించి ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు. కాగా, ఇప్పటివరకు లబ్ధిదారులకు రూ.40 కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయి.

పైలెట్‌ గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి

జిల్లాలోని 11 మండలాల్లోనూ పైలెట్‌ ప్రాజెక్ట్‌ పద్ధతిన ఏడాది క్రితం ఎంపిక చేసిన 11 గ్రామాల్లోనూ ఇళ్ల నిర్మాణం అనుకున్నంత వేగిరంగా లేదు. 530 ఇళ్లు మంజూరైతే 326 ఇళ్ల పనులు ప్రారంభమై పునాది, గోడల నిర్మాణం, స్లాబ్‌ వివిధ దశాల్లో ఉన్నాయి. అయితే, 52 ఇళ్లు మాత్రమే పూర్తై గృహప్రవేశం చేశారు. దాదాపు రూ.10 కోట్ల వరకు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అయింది. 530 ఇళ్లలో 231 ఇళ్లు ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. అలాంటి వారికి అవగాహన కల్పించి రుణం మంజూరు చేయడంలో అధికారులు విఫలమవుతుండడం ఓ కారణం కాగా, భూసమస్యలు, ఇతరత్రా సమస్యలు కూడా మరో కారణంగా చెప్పవచ్చు. ఇల్లు కట్టుకునేందుకు ఆసక్తి చూపని వారి స్థానంలో ఇతరులకు అవకాశం కల్పించడంలోనూ అధికారులు ముందుకెళ్లలేకపోతున్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సత్యశారద

Advertisement
 
Advertisement
Advertisement