– హన్మకొండ కల్చరల్
సంగీతంలో మత్తు ఉంది. అంతు చిక్కని మహత్తు ఉంది. వ్యాధులను నయం చేసే గుణం ఉంది. మనసును తేలిక చేసే మహత్యం ఉంది. చరిత్రలో ఆ మహిమతో కొందరు జీవిత సారం తెలుసుకున్నారు. సరిగమలతో మరికొందరు భవ సాగరం దాటారు. అంతటి ప్రాధాన్యమున్న కళలో రాణించేందుకు బాల్యంలో ఆసక్తి ఉండి నేర్చుకోనివారు.. నేర్చుకుందామన్నా.. అవకాశాలు రాని వారు.. జిజ్ఞాసను నెరవేర్చుకునేందుకు విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల బాటపడుతున్నారు. వృత్తి రీత్యా ఉద్యోగం చేస్తూనే ప్రవృత్తి కోసం విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు. అలాంటి సంగీత పిపాసుల నేపథ్యమే ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ..
వరంగల్‌లోని విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో సితార్
శిక్షణ పొందుతున్న విద్యార్థులు
‘నాకు సంగీతమంటే ఇష్టం. సివిల్స్‌కి సన్నద్ధమయ్యే ముందు కర్నాటక వయోలిన్ నేర్చుకున్నా. తర్వాత విధుల్లో బిజీగా ఉంటుండడం వల్ల సాధ్యం కాలేదు. ఇప్పుడు మళ్లీ సాధన చేస్తున్నా. ఇలా విద్యార్థులతో ప్రదర్శన ఇవ్వడం సంతోషంగా ఉంది.
– ఇటీవల హనుమకొండలో జరిగిన
సంగీతోత్సవంలో కలెక్టర్ స్నేహ శబరీష్
స్వయంగా వయోలిన్ ప్రదర్శన ఇచ్చిన
సమయంలో చేసిన వ్యాఖ్యలు.
వారంతా వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. పలు హోదాల్లో ఉన్నారు. ఐదారంకెల జీతం తీసుకుంటున్నారు. చుట్టూ సకల సౌకర్యాలున్నాయి.. కానీ, వారిని ఓ వెలితి వెంటాడుతోంది. ఆ జిజ్ఞాసే వారిని కఠోర సాధనకు ఉపక్రమించింది. వీరందరి కళలకు జీవం పోస్తోంది భద్రకాళి ఆలయ ప్రధాన ఆర్చ్ సమీపంలోని విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల. ఇక్కడ శాసీ్త్రయ కూచిపూడి, పేరిణి, హిందుస్థానీ, కర్ణాటక సంగీతం, కర్ణాటక వయోలిన్, సితార్, తబలావంటి శిక్షణ ఇస్తున్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడడం.. విద్యార్థుల్లో కళలపై ఆసక్తి పెంచడం.. వివిధ కళల్లో శిక్షణ ఇచ్చి విశిష్టతను చాటి చెప్పడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ముందుకు వెళ్తోంది. ఇప్పటికే వేలాది మంది ఇక్కడ శిక్షణ పొంది శాసీ్త్రయ కళల్లో రాణిస్తున్నారు. ఈ కళాశాలలో 10 ఏళ్ల బాలల నుంచి 75 ఏళ్ల వృద్ధుల వరకు శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం ఈ కళాశాలలో సంగీత, నృత్య అధ్యాపకులు ప్రిన్సిపాల్ యన్.సుధీర్‌కుమార్.. ఇదే కాలేజీలో సరిగమలు పలికిన విద్యార్థి కావడం విశేషం.
సంగీతంలో జిజ్ఞాసను ప్రదర్శిస్తున్న ఉద్యోగులు
వివిధ రకాల వాయిద్యాల్లో శిక్షణ
మానసిక ప్రశాంతత కోసం ‘కళల’ బాట
విధి నిర్వహణ ముగిశాక సమయం కేటాయింపు
నేర్పుతున్న విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల
– హన్మకొండ కల్చరల్


