పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
సంగెం: ఇందిరమ్మ ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. కొత్తగూడెం గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇంటిని శనివారం ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల కళ్లలో ఆనందం చూడడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, ప్రాధాన్యతా క్రమంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ గాలి చేరాలు, పార్టీ మండల అధ్యక్షుడు చొల్లేటి మాధవరెడ్డి, నాయకులు ఎనబోతుల సదయ్య తదితరులు పాల్గొన్నారు.
నేడు గురుకుల ప్రవేశ పరీక్ష
పర్వతగిరి: ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లో ఐదో తరగతి, ఆరో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం ఆదివారం కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు డీసీఓ అపర్ణ తెలిపారు. ఈమేరకు శనివారం ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 9 కేంద్రాల్లో మొత్తం 3,933 మంది విద్యార్థులు ప్రవేశపరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షను పారదర్శకంగా, సక్రమంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విద్యార్థులు హాల్ టికెట్లతో సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
సమన్వయంతో బాలల హక్కుల పరిరక్షణ
హన్మకొండ అర్బన్: బాలల హక్కుల పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చైర్‌పర్సన్ కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డి అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం హనుమకొండ కలెక్టరేట్‌లో హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనలో లోపాలున్నాయని పేర్కొన్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలల సౌకర్యం కల్పించాలని, విద్యార్థులకు నాణ్య మైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని హనుమకొండ, వరంగల్ డీఈఓ లను ఆదేశించారు. కమిషన్ సభ్యులు మరిపల్లి చందన, బండి అపర్ణ, కంచర్ల వందనగౌడ్, వచన్ కుమార్, ప్రేమలత అగర్వాల్, డీఆర్వో వైవీ గణేశ్, ఆర్జేడీ ఝాన్సీలక్ష్మీబాయి, జిల్లా సంక్షేమ అధికారులు విశ్వజ, మల్లీశ్వరి, డీఎంహెచ్‌ఓలు అప్పయ్య, సాంబశివరావు, భూపాలపల్లి అదనపు ఎస్పీ నరేశ్, ఎస్.ప్రవీణ్‌కుమార్, ఉమ, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ భాస్కర్, జి.తిరుపతి, అధికారులు పాల్గొన్నారు.
మరో మైలురాయిని అధిగమించిన కేఎంసీ
ఎంజీఎం: కాకతీయ వైద్య కళాశాల మరో మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం 100కు పైగా వైద్యసీట్లతో పాటు ఏటా సూపర్‌స్పెషాలిటీ సాధించాలనే లక్ష్యంతో కొనసాగుతోంది. ఈక్రమంలో ఈ ఏడాది నేషనల్ మెడికల్ కౌన్సిల్ కేఎంసీకి 10 సూపర్‌స్పెషాలిటీ సీట్లను మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యఅనిల్ పేర్కొన్నారు. 20 రోజుల క్రితం సూపర్‌స్పెషాలిటీ సీట్ల మంజూరు కోసం నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇన్‌స్పెక్టర్లు ఎంజీఎంతో పాటు కేఎంసీలో తనిఖీలు నిర్వహించి నివేదికలు కౌన్సిల్‌కు అప్పగించారు. ఈ నివేదికల ప్రకారం ఆస్పత్రి, కళాశాలలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో గమనించి కార్డియాలజీ, కార్డియోథెరాసిక్, వాస్క్యులర్ సర్జరీ, యూరాలజీ, ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ, పిడియాట్రిక్ సర్జరీలో రెండు సీట్ల చొప్పున మంజూరు చేసింది.
15కు చేరిన సూపర్‌స్పెషాలిటీ పీజీ సీట్లు
నెఫ్రాలజీ విభాగంలో 2023 నుంచి ఐదు సూపర్‌స్పెషాలిటీ సీట్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. తాజాగా మంజూరైన 10 సీట్లతో కేఎంసీలో అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎంజీఎం వంటి ఆస్పత్రిలో పీజీ సీట్ల మంజూరు వల్ల పేదలకు లక్షలాది రూపాయలు విలువ చేస్తే సూపర్‌స్పెషాలిటీ సేవలు మెరుగుపడనున్నాయి.


