రాణి చేతిలోనే వర్ధన్నపేట
మున్సిపల్ చైర్మన్ పదవిలో కీలకంగా స్వతంత్ర అభ్యర్థి శీభారాణి
సాక్షి, వరంగల్: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడైనా అధికారం ఇంకా దోబుచులాడుతోంది. జనరల్ రిజర్వేషన్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ చేజిక్కించుకుంటుందా.. లేక బీఆర్‌ఎస్ దక్కించుకుంటుందా అన్న ఉత్కంఠ అక్కడి పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజల్లో నెలకొంది. ముఖ్యంగా ఇక్కడ ఎవరు జెండా ఎగురవేయాలన్న స్వతంత్ర అభ్యర్థి నేతావత్ శీభారాణి మద్దతు అవసరం. 2020, జనవరి 22న జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఒక్క ఓటు తేడాతో ఓడిన ఆమె.. ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి వాలీబాల్ గుర్తుతో ఇంటింటి ప్రచారం చేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి మగ్నిపై 47 ఓట్ల తేడాతో విజయఢంకా మోగించారు. గత ఎన్నికల్లో ఓడిన శీభారాణి ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా గెలవడంతో ఎక్కడాలేని ప్రాధాన్యం ఏర్పడింది. ఎందుకంటే, 12 వార్డులున్న వర్ధన్నపేటలో బీఆర్‌ఎస్‌కు ఆరు, కాంగ్రెస్‌కు ఐదు రావడంతో ఇరు పార్టీలకు ఇప్పుడు స్వతంత్య్ర అభ్యర్థి శీభారాణి అవసరం ఏర్పడింది. మద్దతు కోసం వెళ్లిన కాంగ్రెస్ నేతలకు ‘చైర్మన్’ పీఠం ఇవ్వాలని ఆమె షరతు విధించారు. అయితే, అదంతా కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడాల్సిన విషయం కావడంతో ఆమెకు పూర్తిస్థాయిలో భరోసా ఇవ్వలేదనే ప్రచారం ఉంది. అధికారం కావాలనుకుంటే రాణి మద్దతు తప్పనిసరి కావడంతో బీఆర్‌ఎస్ కూడా ఆమెకు చైర్మన్ గిరి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల వరకు శీభారాణి బీఆర్‌ఎస్‌లోనే ఉండడంతో ఆమె మద్దతు తమకే ఉంటుందన్న ధీమాలోనే గులాబీ శ్రేణులు ఉన్నాయి. శీభారాణి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శిబిరంలో చేరిందని హస్తం పార్టీ శ్రేణులు అంటుండగా, బలవంతంగా కాంగ్రెస్ నాయకులు చేర్చుకున్నారని బీఆర్‌ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌లా సాగుతున్న ఈ హైడ్రామాకు సోమవారం తెరపడే అవకాశం ఉంది. ఆరోజు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉండడంతో శీభారాణి మద్దతు ఎవరికనేది తేలిపోనుంది. ఏదిఏమైనా వర్ధన్నపేట మున్సిపల్ అధికారం ‘రాణి’ చేతిలోనే ఉండడంతో ఆమెకు ఎనలేని గౌరవం దక్కిందని చెప్పొచ్చు.
ఎక్స్‌అఫీషియో ఓటు నిబంధనలతో
బీఆర్‌ఎస్‌కు దెబ్బ
కాంగ్రెస్ నుంచి చైర్మన్ రేసులో ఉన్న ఈగ దామోదర్ ఓడిపోవడంతో అదే పార్టీ నుంచి గెలిచిన పాలకుర్తి సారంగపాణికి మార్గం సుగమమైంది. అయితే కాంగ్రెస్‌కు శీభారాణి మద్దతిస్తే చైర్మన్ పదవి ఆమెకు వెళ్లే అవకాశం ఉండడంతో హస్తం పార్టీలోనూ గందరగోళ పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్ నుంచి గుజ్జ వీరన్న, సిలువేరు కుమారస్వామి చైర్మన్ రేసులో ఉన్నారు. ఒకవేళ గతంలో బీఆర్‌ఎస్‌లో పనిచేసిన శీభారాణి ఆపార్టీలోకి వస్తే ఇక్కడా పరిస్థితులు మారే అవకాశముంది. ఇక్కడి చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్‌అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కేఆర్.నాగరాజుకు అవకాశం ఉండడంతో ఇప్పుడున్న ఐదు ఓట్లకు మరో ఓటు కలిసి ఆరు ఓట్లు అవుతాయి. అప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి శీభారాణి మద్దతిస్తే ఏడు ఓట్లు అవుతాయి. ఒకవేళ ఆమె బీఆర్‌ఎస్ పంచన చేరితే కాంగ్రెస్ ఆరుతో ఆగి బీఆర్‌ఎస్ సంఖ్య ఏడుకు చేరుకుంటుంది. ఈ చైర్మన్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఎమ్మెల్యే నాగరాజు.. ఇండిపెండెంట్ అభ్యర్థి శీభారాణి మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉండేలా చూసుకుంటున్నారు. ఎక్స్‌అఫీషియో ఓటుకు వర్ధన్నపేట మున్సిపాలిటీ నుంచి ఎమ్మెల్యే నాగరాజు ఒక్కరే ఉన్నట్లు తెలిసింది. ఎందుకంటే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలతో ఇక్కడ ఎమ్మెల్సీలకు అవకాశం లేకపోవడంతో ఎక్స్‌అఫీషియోపై బీఆర్‌ఎస్ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ఆయా మున్సిపాలిటీల్లో ఓటరై ఉంటేనే అవకాశం ఉంటుందనడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు ఓటు హక్కు లేకుండా పోయింది. దీంతో వర్ధన్నపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ అధికారం ఖరారైంది. అలాగే, వరంగల్ ఎంపీ కడియం కావ్యకు ఇక్కడ ఎక్స్‌అఫీషియో ఓటుకు అవకాశమున్నా అంతగా ఆమె అవసరం లేకపోవడంతో రాజకీయ ప్రాధాన్యంలో భాగంగా తొర్రూరు మున్సిపాలిటీలో ఎక్స్‌అఫీ షియో ఓటు నమోదు చేసుకున్నారని సమాచారం.
ఆమె ఎవరికి మద్దతు ఇస్తే వారికే అధికారం ఖాయం
చైర్మన్ గిరి ఇవ్వాలంటూ కాంగ్రెస్‌కు షరతు
తనవైపునకు తిప్పుకునేందుకు బీఆర్‌ఎస్ యత్నం
కాంగ్రెస్‌కు ఎక్స్‌అఫీషియో ఓటుతో కలిసొచ్చే అవకాశం
అయినా శీభారాణి మద్దతుంటేనే హస్తానికి అధికారం
రాణి చేతిలోనే వర్ధన్నపేట
రాణి చేతిలోనే వర్ధన్నపేట


