మళ్లీ గులాబీ జెండా పట్టిన ‘అరూరి’
హసన్‌పర్తి: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ గులాబీ జెండా పట్టుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట తారకరామారావు సమక్షంలో బుధవారం హైదరాబాద్‌లో పార్టీలో చేరారు. అదేవిధంగా 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత, 56వ డివిజన్ కార్పొరేటర్ సిరంగి సునీల్, 6వ డివిజన్ కార్పొరేటర్ మునిగాల సరోజన, మాజీ జెడ్పీటీసీ సభ్యులు సుభాశ్, రేణుకుంట్ల సునీత, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు బండా రత్నాకర్‌రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్లు జక్కుల రమేష్, వనంరెడ్డి తిరిగి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉండగా మరో ముగ్గురు కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్లో చేరడానికి సిద్ధమైనట్లు తెలిసింది. మంగళవారం వారితో అరూరి రమేశ్ రహస్య సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. చివరి క్షణంలో ఆ కార్పొరేటర్లు మనసు మార్చుకున్నారని, ఫోన్ చేసినా ఎలాంటి స్పందన రాలేదని తెలిసింది.


