లింగగిరి జాతరకు పోటెత్తిన భక్తజనం
స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు
నర్సంపేట రూరల్ : ప్రతీ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండలంలోని లింగగిరి గ్రామంలో నిర్వహించే లక్ష్మీచెన్నకేశవ స్వామి జాతరకు ఈసారి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి, కనుమ పండుగల రోజు ఆలయ కమిటీ బాధ్యులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. గుడి ప్రధాన అర్చకుడు శ్రీమన్ రామాచార్యులు, వేద పండితుడు భరద్వాజ్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. మండలంలోని 30 గ్రామాల ప్రజలే కాకుండా నెక్కొండ, ఖానాపురం, దుగ్గొండి, నల్లబెల్లి పర్వతగిరి, సంగెం, కేసముద్రం, నర్సంపేట మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వేర్వేరుగా హాజరై మొక్కులు సమర్పించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నర్సంపేట ఎస్సై రవీందర్, నెక్కొండ సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజేష్‌రెడ్డి, మహేందర్ భారీ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ రజితకుమార్, తదితరులు పాల్గొన్నారు.


