ప్రత్యేక దృష్టి
పదో తరగతి ఫలితాలపై
100 శాతం ఫలితాల సాధనకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
కాళోజీ సెంటర్: మార్చి 14నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ వార్షిక పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి 100 శాతం ఫలితాలు సాధించేలా జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు స్కూల్ కాంప్లెక్స్‌ల్లో ఉపాధ్యాయులతో ప్రత్యేక ప్రణాళిక, కార్యాచరణ రచించి స్పెషల్ క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. గత నవంబర్ నుంచి డిసెంబర్ వరకు సాయంత్రం 4.45నుంచి 5.15 గంటల వరకు అదనంగా తరగతులు నిర్వహించారు. పరీక్షల సమయం దగ్గర పడుతుండడంతో జనవరి నుంచి ఉదయం 8నుంచి 9 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షల ఫలితాల ఆధారంగా అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించి విద్యార్థులను మూడు గ్రూపులుగా విభజించి ప్రత్యేక క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. కాగా, 2025– 26 ప్రకారం పదో తరగతి సిలబస్ ఇప్పటికే పూర్తి చేశారు.
విద్యార్థుల తల్లిదండ్రులకు సూచనలు
టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో జిల్లాలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక ప్రణాళికలో భాగంగా దత్తత తీసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు సదరు ఉపాధ్యాయులు ప్రత్యేక సూచనలు చేస్తూ సలహాలు ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల పరిస్థితులను వారికి తెలియజేస్తూ ఇంకా మెరుగుపడేందుకు చేపట్టాల్సిన అంశాలకు వివరిస్తున్నారు. విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా పౌష్టికాహారం అందించాలని సూచిస్తున్నారు.
అభ్యసన దీపికల ద్వారా సాధన
ప్రత్యేక తరగతుల్లో ప్రభుత్వం అందించిన అభ్యాసన దీపికలోని అంశాలను విద్యార్థులతో ఉపాధ్యాయులు సాధన చేయిస్తున్నారు. వాటిలోని ప్రశ్నల ఆధారంగా ప్రతి శనివారం వీక్లీ స్లిప్ టెస్ట్ నిర్వహించి గత ప్రశ్నపత్రాలు, సమాధానాలను ప్రాక్టీస్ చేయిస్తున్నారు. చేతిరాత అందంగా ఉండేలా, కొట్టివేతలు లేకుండా జవాబులు రాసేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. జిల్లాలో 137 ప్రభుత్వ పాఠశాల్లో 5,292 మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
వందశాతం ఫలితాల కోసం కృషి
పదో తరగతి పబ్లిక్ వార్షిక పరీక్షలు మార్చి 14నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి 100 శాతం ఫలితాలు సాధించే విధంగా కృషి చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం 8నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4.15నుంచి 5.15గంటల వరకు అదనంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఆ సమయాల్లో విద్యార్థులకు స్నాక్స్ అందిస్తున్నాం.
– ఉండ్రాతి సుజన్‌తేజ,
అకాడమిక్ మానిటరింగ్ జిల్లా అధికారి
రోజు అదనంగా రెండు గంటలపాటు స్పెషల్ క్లాసులు
మార్చి 14నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు వార్షిక పరీక్షలు
పరీక్షలు రాయనున్న ప్రభుత్వ స్కూళ్లవిద్యార్థులు 5,292 మంది
ఫిబ్రవరి 17 నుంచి టెన్త్ ప్రీ ఫైనల్
పదో తరగతి పబ్లిక్ వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని 290 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 9,497 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 17 నుంచి 24వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ పాఠశాల విద్యా సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారని డీఈఓ కార్యాలయం తెలిపింది. ఫిబ్రవరి 17న ప్రథమ భాష, 18న ద్వితీయ భాష, 19న తృతీయ భాష, 20న గణిత శాస్త్రం, 21న భౌతిక శాస్త్రం, 23న జీవశాస్త్రం, 24న మంగళవారం సాంఘిక శాస్త్రం సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రత్యేక దృష్టి


