పరిహారం అందేలా చూస్తాం
న్యూశాయంపేట/నెక్కొండ: మోంథా తుపాన్ కారణంగా నష్టపోయిన ప్రజలకు, రైతులకు పరిహారం అందేలా చూస్తామని కలెక్టర్ సత్యశారద అన్నారు. వర్షాకాలంలో మోంథా తుపాన్ ప్రభావంతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం వరంగల్ జిల్లా పరిధిలో శుక్రవారం సందర్శించింది. వరద ముంపునకు గురైన నగరంలోని పలు కాలనీలు, గ్రామాల్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, నగర కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి బృందం సభ్యులు పొన్ను స్వామి, నిశాంత్ మిశ్రా, శశివర్ధన్, రాహుల్ బఖేటీ, తదితరులు పర్యటించారు. నగరంలో ఎన్‌ఎన్ నగర్, ఎన్టీఆర్ నగర్, మైసయ్యనగర్‌లో, నెక్కొండలోని చంద్రుగొండ – నెక్కొండ ప్రధాన రహదారి, ధ్వంసమైన రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జీలు, వట్టెవాగు వరదలతో నీట మునిగిన పంటలను పరిశీలించారు. పూర్తిస్థాయి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందిస్తామని కేంద్ర బృందం తెలిపింది. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఎన్సీడీసీఎల్ ఎస్‌ఈ గౌతమ్, జిల్లా పశుసంవర్ధక అధికారి బాలకృష్ణ, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇజ్జగిరి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, ఆర్డీఓ సుమ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు, నర్సంపేట ఏడీఏ దామోదర్‌రెడ్డి, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీఓ నాగరాజు, ఎంపీడీఓ లావణ్య, పశువైద్యాధికారి మమత, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యశారద
కేంద్ర బృందం సభ్యులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన


