● గన్నీ బ్యాగులు తీసుకున్న తర్వాత కూడా పలు కేంద్రాల్లో హమాలీల కొరత వేధిస్తోంది. ఒక బస్తా ధాన్యం నింపేందుకు రూ.25 వసూలు చేస్తుండడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
ఇబ్బందులు ఇవే..
● ఏఈఓలు, సిబ్బంది కొరత కారణంగా రైతులకు మూడు రోజులకోసారి టోకెన్లు జారీ చేస్తున్నారు. వారానికి ఒకసారి మాత్రమే గన్నీ బ్యాగులు కేంద్రాలకు వస్తుండగా.. అవి వచ్చినప్పుడే టోకెన్లు పొందిన రైతులు తీసుకోవాల్సి రావడం ఇబ్బందిగా మారింది.
యాసంగి సాగుకు సంబంధించి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఉమ్మడి పాలమూరులోని వనపర్తి, నాగర్‌కర్నూల్ మినహా మిగిలిన మూడు జిల్లాల్లో పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చినా.. ఆర్భాటానికే పరిమితమయ్యాయి. సుమారు 15 రోజులు గడిచినప్పటికీ క్రయవిక్రయాల్లో వేగం పుంజుకోకపోవడంతో అసలు కొనుగోళ్లు చేస్తారా.. లేదా అనేది తెలియక రైతులు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. క్రయవిక్రయాల్లో రోజుల తరబడి జాప్యంతో వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో అన్నదాతలు రాస్తారోకోకు దిగగా.. ఇలాంటి పరిస్థితులే పలు ప్రాంతాల్లో నెలకొన్నాయి.
– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
ధాన్యం వద్దనే పడిగాపులు..
నాకున్న ఎనిమిదెకరాల్లో వరిని సాగుచేసి.. వారం రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చాను. లారీలు రావడం లేదని ఏవేవో కారణాలు చెబుతూ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఎప్పుడు అకాల వర్షం వచ్చి ధాన్యం తడిసిపోతుందోనని భయంతో ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నా. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి త్వరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. – వెంకటన్న, రైతు,
ఆరేపల్లి, ఆత్మకూర్ మండలం
ఇంకా కొనడం లేదు..
నేను ఈసారి మూడెకరాల్లో వరిసాగు చేశా. పంట కోసి వారం రోజులైంది. గ్రామంలో ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. అధికారులు త్వరగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి. అకాల వర్షాలు, ఈదురుగాలుల భయంతో ఆందోళన చెందుతున్నాం. వానలో ధాన్యం తడిస్తే చేసిన కష్టం నీళ్లపాలవుతుంది. తేమశాతం లేని ధాన్యాన్ని వెంటనే కొనేందుకు చర్యలు తీసుకోవాలి.
– చంద్రారెడ్డి, రైతు, జటప్రోలు,
పెంట్లవెల్లి మండలం
●
ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు 1,018 సెంటర్లు కేటాయించారు. ఇప్పటి వరకు 877 మాత్రమే అందుబాటులోకి రాగా.. ఇందులో కనీసం రెండు శాతం మేర సెంటర్లలో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. మొత్తంగా 11,49,813 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ధారించిన అధికార యంత్రాంగం.. ఇప్పటివరకు ప్రభుత్వ కేంద్రాల ద్వారా కేవలం 36,175 మెట్రిక్ టన్నులు సేకరించింది. అయితే ఉమ్మడి జిల్లాలో వరినాట్లు ఆలస్యంగా పడుతాయని.. కోతలు కూడా ఆలస్యమవుతాయని.. ఆయా ప్రాంతాల్లో అవసరాల మేరకు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని.. కొనుగోళ్లలో ఎక్కడా జాప్యం జరగడం లేదని అధికారులు చెబుతున్నారు.
సన్నాలకే మొగ్గు..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యాసంగిలో 8,33,679 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అయితే ప్రభుత్వం గ్రేడ్–1 సన్న వడ్లు క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,389, గ్రేడ్–2కు రూ.2,369 ఇస్తోంది. దీంతోపాటు సన్నాలకు బోనస్ కింద క్వింటాల్‌కు రూ.500 చొప్పున చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు సన్నాల సాగుకే మొగ్గు చూపారు. 5,31,181 ఎకరాల్లో సన్న ధాన్యం సాగు చేయగా.. 3,02,498 ఎకరాల్లో రైతులు దొడ్డు రకం వరి సాగు చేశారు. అయితే సన్నాలను కొనేందుకు ప్రైవేట్ వ్యాపారులు ముందుకు వస్తున్నా.. దొడ్డు రకాల ధాన్యం కొనేందుకు ఇష్టపడడం లేదు. పలు ప్రాంతాల్లో మాత్రమే దళారులు దొడ్డు రకం వడ్లను క్వింటాకు రూ.2,200లోపు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రైతులు ప్రభుత్వ కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షిస్తూ.. కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.
ఆశలు.. అడియాసలు
ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో పలు ప్రాంతాల్లో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పూర్తిగా ఆరబెట్టిన సన్న వడ్లు క్వింటాకు రూ.2,400 నుంచి రూ.2,450.. తేమ ఉంటే రూ.2,300 నుంచి రూ.2,350 వరకు వెచ్చించి దళారులు కొనుగోలు చేస్తున్నారు. వెంటనే డబ్బులు చెల్లిస్తుండడంతో రైతులు వారి వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే బోనస్ ఆశతో సన్నాలు పండించిన రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బోనస్ చెల్లించాల్సి వస్తుందనే ప్రభుత్వం కావాలని కొనుగోలు చేయకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు.
● దాదాపుగా ప్రారంభమైన అన్ని కేంద్రాల్లో ధాన్యం తరలింపు ప్రధాన సమస్యగా మారింది. అధికారులు కొనుగోలు కేంద్రాలకు వెంటవెంటనే లారీలను పంపించకపోవడమూ కారణమవుతోంది. దీంతోపాటు మిల్లుల కేటాయింపుల్లో గందరగోళంతో లోడ్ అయిన వాహనాలు కేంద్రాల్లోనే ఉంటున్నాయి. దీంతో రైతులు రేయింబవళ్లు అక్కడే కాపలా ఉండాల్సి వస్తుంది.
● గద్వాల జిల్లాలో మిల్లులకు గతంలో కేటాయించిన సీఎమ్మార్ ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. ఈ యాసంగి ధాన్యం నిల్వకు సరిపడా గోడౌన్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులకు మిల్లర్లు వినతిపత్రం అందించారు. వనపర్తి జిల్లాలో డీఫాల్ట్ మిల్లర్లు అధికంగా ఉండడంతో కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.
జిల్లాల వారీగా యాసంగి సాగు, కొనుగోలు కేంద్రాల వివరాలు..
ఆర్భాటానికే పరిమితమైన కొనుగోలు కేంద్రాల ప్రారంభం
సెంటర్లలో అస్తవ్యస్తంగా మారిన క్రయవిక్రయాలు
రోజులకొద్దీ జాప్యంతో అన్నదాతల పడిగాపులు
పలు ప్రాంతాల్లో రోడ్డెక్కుతున్న రైతులు
దొడ్డు వరి సాగు చేసిన వారికి తప్పని ఎదురుచూపులు
ప్రభుత్వం ఈసారి కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆన్‌లైన్‌లో మిల్లులకు కేటాయించే పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ విధానం అమలులో సమస్యలు తలెత్తడంతో క్రయవిక్రయాల్లో జాప్యం జరుగుతుండడంతో అధికారులు తిరిగి పాత విధానం ప్రకారమే రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నారు. దీనిపై అస్పష్టతతో కొనుగోళ్లు ఊపందుకోవడం లేదని తెలుస్తోంది.


