ప్రశాంతంగా ‘నీట్‌’ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ‘నీట్‌’

May 4 2026 7:01 AM | Updated on May 4 2026 7:01 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌/ మహబూబ్‌నగర్‌ క్రైం: జిల్లాలో నీట్‌–యూజీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు విద్యార్థులను ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించారు. దీంతో ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల వద్ద హడావుడి కనిపించింది. పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి వెళ్లే క్రమంలో బాల బాలికలకు వేర్వేరుగా తనిఖీ చేసి పంపించారు. ఈ నేపథ్యంలో 11 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి వెళ్లని విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయకుండా సాయంత్రం 5 గంటల వరకు ఉండాల్సి వచ్చింది. దీంతోపాటు జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులను 25 నిమిషాలు ఆలస్యంగా వదిలారు. ఈ కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు తమ పేరు రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా పరీక్ష రాశారని, వారి పేరును రిజిస్ట్రేషన్‌ చేసి బయటికి వదిలేందుకు ఆలస్యమైందని విద్యార్థులు తెలిపారు. కాగా పరీక్షకు జిల్లావ్యాప్తంగా 12 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 4,214 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 4,141 మంది హాజరుకాగా 73 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో నీట్‌ పరీక్షకు 200 మంది పోలీసులతో బందోబస్తు కల్పించారు. ఈ క్రమంలో ఎస్పీ జానకితోపాటు డీఎస్పీ వెంకటేశ్వర్లు మొదట ఎన్టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు.

రేపు రైతు సదస్సు

కొల్లాపూర్‌: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 90 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5న కొల్లాపూర్‌లోని మహెబూబ్‌ ఫంక్షన్‌హాల్‌లో రైతు సదస్సు నిర్వహించనున్నట్లు ఉద్యానశాఖ డివిజనల్‌ అధికారి లక్ష్మణ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి వనరులు పెరిగిన నేపథ్యంలో సంప్రదాయ పంటల స్థానంలో వాణిజ్య పంటల సాగును ప్రోత్సహించే విధంగా రైతులకు సదస్సులో తగు సూచనలు చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించే సదస్సుకు కేవీకే పాలెం శాస్త్రవేత్తలు హాజరవుతారని తెలిపారు.

మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఇవ్వడంతో పాటు వ్యవసాయ పనులు ముగియడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మైసమ్మను దర్శించుకున్నారు. అప్పటికే జాతర మైదానంలో సిద్ధంచేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీతో జాతర మైదానం కిక్కిరిసిపోయింది. కొంతసేపు ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. దాదాపు 15వేల మంది భక్తులు మైసమ్మను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారి రామేశ్వరశర్మ తెలిపారు.

‘పాలమూరు’కు

జాతీయ హోదా ఇవ్వాలి

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): పాలమూర్‌–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా సాధనకు ఎంపీ డీకే అరుణ కృషి చేయాలని సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి పరమేశ్‌గౌడ్‌ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మే 10న రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తున్నారని, పాలమూరుకు జాతీయ హోదా ప్రకటన చేయించాలని కోరారు. 2014లో ఎన్నికల ముందు పాలమూరు సాక్షిగా ఆనాటి సుష్మాస్వరాజ్‌ బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరుకు జాతీయ హోదా కల్పిస్తామని ఇచ్చిన మాటను గుర్తు చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చినా పాలమూరుకు ఇవ్వాల్సిన జాయతీ హోదాను మరిచిపోందని విమర్శించారు. జాతీయ హోదా కల్పించకుండా బీజేపీ తెలంగాన ప్రజలను మోసం చేసిందని తెలిపారు. ఎంపీగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణను గెలిపించిన పాలమూరుకు మాత్రమే జాతీయ హోదా రాలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకత్వం చొరవ చూపడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని తెలిపారు. కృష్ణ బేసిన్‌లో పాలమూరు క్యాచ్‌మెంట్‌ ఏరియా 70శాతం ఉన్న పాలమూరుకు దక్కాల్సిన నీళ్ల వాట దక్కడంలేదని ఆరోపించారు. ఈనెల 10న రాష్ట్రానికి వచ్చే ప్రధాని నోటితో పాలమూరుకు జాతీయ హోదాను ప్రకటించేలా ఇక్కడి బీజేపీ నాయకులు కృషి చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement