మండలాల వారీగా సాగు..
బహిరంగ మార్కెట్‌లో తరుగు, కమీషన్ పేరుతో మామిడి రైతులు విలవిల
● నెలక్రితం టన్నుకు రూ.1.50 లక్షలు, నేడు రూ.30 వేలే
● రైతులకు సకాలంలో డబ్బులు
చెల్లించని వ్యాపారులు
● ఆశించిన దిగుబడి రాక
నష్టాల ఊబిలోకి..
● జిల్లాలో 17 వేల ఎకరాల్లో సాగు
రూ.60 లక్షలు వెచ్చించి వివిధ గ్రామాల్లో 10 తోటలు కౌలుకు తీసుకున్నా. ఇప్పటికీ మామిడి కాయలు విక్రయిస్తే రూ.15 లక్షలు కూడా రాలే. మూడు రోజుల క్రితం ఈదురు గాలులతో 5 టన్నుల కాయలు నేలరాలగా వాటిని విక్రయిస్తే ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు కూడా సరిపోలే. ఉన్నతాధికారులు కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి, దళారుల దోపిడీని అరికట్టాలి.
– పెబ్బేటి మహేష్,
మామిడి కౌలు రైతు, వీపనగండ్ల
ప్రతి ఏటా మామిడి రైతులు కొనుగోలుదారుల చేతుల్లో దోపిడీకి గురై తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం, అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలి.
– దొడ్ల కవిత, సర్పంచ్, గోపల్‌దిన్నె
నిబంధనలు పాటించకుండా రైతుల నుంచి మా మిడి కాయలు కొనుగోలు చేసి ఇబ్బందులు కలిగించే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఫిర్యాదు రూపంలో తెలియజేస్తే క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి, బాధ్యులపై కేసులు నమోదు చేయిస్తాం.
– విజయభాస్కర్‌రెడ్డి,
జిల్లా ఉధ్యానవన శాఖ అధికారి, వనపర్తి
వీపనగండ్ల: ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యాపారుల నిలువు దోపిడీ వెరిసి మామిడి రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. కొనబోతే కొరివి.. అమ్మబోతే అరివి అన్న చందంగా మారింది వారి పరిస్థితి. మామిడి చెట్లకు వేసే ఎరువులు, పూత దశలో పిచికారీ చేసే రసాయనిక మందులకు రూ.వేలు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తుండడంతో పెట్టుబడి వ్యయం తడిసిమోపెడు అవుతుంది. తీరా పంట దిగుబడి వచ్చాక మామిడి కాయలు అమ్ముదామని పోతే బహిరంగ మార్కెట్‌లో దళారులు తరుగు, కమీషన్ల పేరుతో దోచుకుంటున్నారని వాపోతున్నారు. ఇటీవలే కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులతో మామిడి కాయలు నేలరాలడంతో దిగుబడి దారుణంగా పడిపోయింది. మిగిలిన పంటను అయినా అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర రావడం లేదంటున్నారు. స్పందించాల్సిన ఉద్యాన శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో మాయాజాలం
జిల్లాలో పెబ్బేరు, కడుకుంట్ల గ్రామాల వద్ద కొందరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకొని రైతుల నుంచి మామిడి కాయలు కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
వీపనగండ్ల మండలంలో మండల మహిళా సమైక్య ద్వారా మామిడి కాయల కొనుగోళ్లు ప్రారంభించి కాయ సైజు 250 గ్రాముల నుంచి 450 గ్రాముల మధ్యే ఉండాలన్న నిబంధనను విధించి, రోజు రెండు టన్నుల కాయలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. కవర్ కట్టిన కాయలు తీసుకోవడం లేదు.
హైదరాబాద్ సమీపంలోని బాటసింగారంలో మామిడి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా అక్కడ నిబంధనలను పాటించడం లేదు. 4 శాతం తరుగు తీయాల్సి ఉండగా.. హమాలీ తరుగు, కాయలు నాణ్యతగా లేవని సాకు చూపి 18 శాతం తరుగును తీస్తున్నారు. నెల క్రితం టన్ను కాయలు రూ.1.50 లక్షలు పలకగా నేడు టన్నుకు రూ.30 చెల్లిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.
మండలం రైతులు ఎకరాల్లో..
అమరచింత 101 449
ఆత్మకూర్ 240 769
కొత్తకోట 244 592
మదనాపురం 96 284
చిన్నంబావి 1,099 2,410
పాన్‌గల్ 1,081 1,980
వీపనగండ్ల 2,389 5,406
ఖిల్లాఘనపురం 193 421
గోపాల్‌పేట 292 675
పెబ్బేరు 515 1,319
పెద్దమందడి 210 562
రేవల్లి 150 344
శ్రీరంగాపురం 310 648
వనపర్తి 456 963
ఏదుల 381 748
మొత్తం 7,757 17,576


