మదనాపురం: ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలిగించకుండా వేగంగా కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ నిర్వాహకులను ఆదేశించారు. మదనాపురంలో ఐకేపీ సెంటర్‌తో పాటు అజ్జకొల్లు, రామన్‌పాడు, దుప్పల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి, క్షేత్రస్థాయిలో కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు తెచ్చిన ధాన్యాన్ని నాణ్యతా ప్రమాణాల మేరకు వెంటనే సేకరించాలని సూచించారు. తూకాల్లో రైతులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిర్ణీత బరువు కంటే అదనంగా తూకం వేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
త్వరగా మిల్లులకు తరలించాలి
కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు లారీల ద్వారా మిల్లులకు తరలించి, కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా చూడాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఐకేపీ మార్కెటింగ్ ఏపీఎం రాంబాబు, తహసీల్దార్ రేపోలు రాజు, ఏపీఎం తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
5లోగా అక్రిడిటేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి
వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి జర్నలిస్టుకు మీడియా అక్రిడిటేషన్ కార్డు జారీ చేసేందుకు వీలుగా జిల్లాలోని జర్నలిస్టులు మే 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి పి.సీతారాంనాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు తప్పా మిగిలిన జర్నలిస్టులు యాజమాన్యాల సిఫారస్ లెటర్, సర్క్యూలేషన్, అనుభవ పత్రాలతో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని, కాపీ డీపీఆర్‌ఓ కార్యాలయంలో అందించాలన్నారు. జర్నలిస్టు ప్రస్తుత హోదానే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఎడిట్ ఆప్షన్ లేనందున జర్నలిస్టులు జాగ్రత్తగా దరఖాస్తు చేసుకోవాలని, ఇప్పటికే సడ్మిట్ చేసిన దరఖాస్తుల్లో ఏమైనా మార్పులు చేయాలనుకునే వారు మే 5 లోపు డీపీఆర్‌ఓకు నేరుగా ఫోన్ చేసి తన దరఖాస్తును డిలీట్ చేయించుకొని తిరిగి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 5 వరకు వచ్చే దరఖాస్తులను మాత్రమే కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించే తదుపరి మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో చర్చించి, అర్హులైన జర్నలిస్టులకు కార్డులు మంజూరు చేస్తామన్నారు.


