‘కాంగ్రెస్‌ రైతుల ఉసురు తీస్తోంది’ | - | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌ రైతుల ఉసురు తీస్తోంది’

May 3 2026 7:41 AM | Updated on May 3 2026 7:41 AM

ఆత్మకూర్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని, ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తోందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. శనివారం గాంధీచౌక్‌లో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రవికుమార్‌ ఆధ్వర్యంలో రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ.. కేసీఆర్‌ హయాంలో రైతులు రాజులుగా బతికారని, సకాలంలో ధాన్యం కొనుగోలు చేశామని గుర్తుచేశారు. వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా లారీలు రావడం లేదని, గన్నీ బ్యాగులు లేవనే సాకుతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా అధికారులు చేతులెత్తేస్తున్నారని మండిపడ్డారు. అకాల వర్షాలతో ధాన్యం దిగుబడి తగ్గిందని, వచ్చిన అరకొర పంటను కాపాడుకుని కేంద్రానికి తీసుకువస్తే కొనే దిక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఽశంకుస్థాపనలకే పరిమితం

ఆత్మకూర్‌ మండలంలో రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న మంత్రి, కాంగ్రెస్‌ నాయకులు ఆ అభివృద్ధి శంకుస్థాపనలకే పరిమితమైందనే విషయం మరవొద్దని మాజీ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన పనులు సైతం ప్రారంభించలేదని, ఈ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, లక్ష్మీకాంత్‌రెడ్డి, కోటేష్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement