‘ప్రతి కార్మికుడిని గౌరవించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘ప్రతి కార్మికుడిని గౌరవించాలి’

May 2 2026 7:26 AM | Updated on May 2 2026 7:26 AM

వనపర్తి: కష్టపడి పనిచేసే ప్రతి కార్మికుడిని గౌరవించాల్సి అవసరం ఉందని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వినోద్‌ కుమార్‌, డీఎస్పీ బాలాజీ నాయక్‌ అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఇతర కార్మికులను, ఉపాధి హామీ పథకంలో జిల్లాలోనే అత్యధిక పని దినాలు సద్వినియోగం చేసుకున్న కార్మికురాలు విజయమ్మ సన్మానించారు. అలాగే ఐటీఐ విద్యార్థులకు ప్రతిభా పురస్కార పత్రాలు అందజేశారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. కార్మికుల శ్రమే సమాజ అభివృద్ధికి మూల స్తంభమని కొనియాడారు.

కార్మికులే ప్రగతి చక్రాలు

కార్మికులే సమాజ ప్రగతి చక్రాలని, నిరంతరం వారు కష్టపడి చేయడం వల్లే అందరి అవసరాలు తీరుతున్నాయని డీఎస్పీ బాలాజీనాయక్‌ అన్నారు. ప్రతి వ్యక్తి తను పనిలో నిబద్ధతతో ఉంటే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. కార్మికులకు గౌరవించడం, వారి సేవలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఐటీఐ కళాశాలకు సంబంధించిన అడ్వాన్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న కోర్సులకు సంబంధించిన పోస్టర్‌, కార్మిక శాఖ ఆధ్వర్యంలో కార్మిక చట్టాలపై, కార్మికులకు కల్పించే పథకాలపై రూపొందించిన బుక్‌లెట్‌ను అధికారులు ఆవిష్కరించారు. జిల్లాకు చెందిన ఏబీడీ లిక్కర్‌ పరిశ్రమలో 1,600 మంది కార్మికులు పనిచేస్తున్నారని, యాజమాన్యం తరఫున హాజరైన రీజనల్‌ మేనేజర్‌ ఉమాశంకర్‌ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, జిల్లా కార్మిక శాఖ అధికారి రవి, ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్‌ హక్‌, ఐటిఐ విద్యార్థులు, అధికారులు, సిబ్బంది, కార్మికులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement