వనపర్తిటౌన్: ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్మే మేఘారెడ్డి అన్నారు. మే డే సందర్భంగా శుక్రవారం బస్టాండ్‌లో ఆర్టీసీ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తుందని, ఆర్టీసీ విస్తరణపై వివిధ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. మహాలక్ష్మి పథకంతో ఎంతో మంది మహిళలకు ఉచిత ప్రయాణం అందుతుందని తెలిపారు. ఇటీవల జరిగిన ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను ప్రభుత్వం త్వరగా పరిష్కరించి, పీఆర్సీ పెంచిందని, మిగతా సమస్యలు సైతం త్వరలోనే పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చడంలో కండక్టర్లు, డ్రైవర్ల సేవలు అభినందనీయమని కొనియాడారు. అంతకుముందు ఎమ్మెల్యేకు డీఎం దేవేందర్‌గౌడ్‌కు మొక్క అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో పుర వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్, ఆర్టీసీ అధికారులు, కౌన్సిలర్లు, డిపో సిబ్బంది పాల్గొన్నారు.
ఆయిల్‌పాం సాగుతో సుస్థిర ఆదాయం
గోపాల్‌పేట: ఆయిల్‌పాం మొక్కలు ఒకసారి నాటితే మూడేళ్ల తర్వాత కాపు ప్రారంభమై 30 ఏళ్ల పాటు నిరంతరం ఆదాయం అందిస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఆయిల్‌పాం సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలిక నీటివసతి, ఐదెకరాల కంటే ఎక్కువ పొలం ఉన్న రైతులు ఆయిల్‌పాం తోటలు వెంటనే సాగు చేయడం ద్వారా లాభాలు గడించవచ్చన్నారు. ఆయిల్‌పాం సాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, అలాగే గెలలు అమ్ముకునేందుకు ఫ్యాక్టరీల విషయంలో, డబ్బుల విషయంలో దిగులు చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ప్రస్తుతం గోపాల్‌పేట మండలంలో 320 ఎకరాల్లో ఆయిల్‌పాం తోటలు పెంచుతున్నారని, భవిష్యత్‌లో మరింత విస్తరించాలని కోరారు. మండల వ్యవసాయ అధికారిణి కరుణశ్రీ, అధికారులు, రైతులు పాల్గొన్నారు.


