●
జిల్లాలోని వివిధ మండలాల్లో మొత్తం 17 క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. మే నెల చివరి వరకు శిక్షణ కొనసాగుతుంది. ఇప్పటికే శిక్షకులకు అన్నిరకాల సూచనలు చేశాం. 14 ఏళ్లలోపు బాలలు శిబిరాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఒక శిబిరంలో ఎంతమంది విద్యార్థులైనా ఉండవచ్చు. శిక్షకులకు రూ.5 వేల గౌరవ వేతనం చెల్లిస్తూ విద్యార్థులకు తర్ఫీదునిచ్చేలా ప్రోత్సహిస్తున్నాం.
– సుధీర్‌రెడ్డి, డీవైఎస్‌ఓ
అమరచింత: వేసవి సెలవుల్లో బడిఈడు పిల్లలు చెడుదారి పట్టకుండా వారికి క్రీడలపై మక్కువ కల్పిస్తూ నచ్చిన క్రీడను పరిచయం చేస్తూ తర్పీదునిచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటుచేసి నెలరోజుల పాటు వివిధ క్రీడల్లో శిక్షణనిస్తున్నారు. కొన్ని మండలాల్లో క్రీడా శిబిరాలు ప్రారంభం కాగా.. మిగిలిన ప్రాంతాల్లో మరో రెండ్రోజుల్లో ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. శిక్షకులకు ప్రభుత్వం రూ.5 వేల గౌరవ వేతనం చెల్లించనుంది. శిబిరాలకు వచ్చే 14 ఏళ్లలోపు బాలలు తమ పేర్లను నమోదు చేసుకోవాలి.
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా వేసవి సెలవులు పూర్తయే వరకు విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇవ్వడానికి జిల్లావ్యాప్తంగా 17 ప్రాంతాలు ఎంపిక చేశారు. జిల్లాకేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో 7, మిగిలిన శిబిరాలు మండలాల్లో నిర్వహించనున్నారు. మండలాల్లో పీఈటీల ప్రోత్సాహంతో వచ్చిన శిక్షకుల దరఖాస్తులను పరిశీలించి వాటి ఆధారంగా శిక్షణ కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
క్రీడాసామగ్రి పంపిణీ..
శిక్షణకు హాజరయ్యే క్రీడాకారులకు ప్రభుత్వమే ఉచితంగా క్రీడాసామగ్రి అందిస్తుందని జిల్లా క్రీడలు, యువజన సర్వీసులశాఖ అధికారి సుధీర్‌రెడ్డి తెలిపారు. వాలీబాల్, ఫుట్‌బాల్, క్రికెట్ కిట్లు, అథ్లెటిక్స్ సామగ్రిని ఆయా కోచ్‌లకు జిల్లాకేంద్రంలో పంపిణీ చేశారు. శిక్షణకు వచ్చే క్రీడాకారులు వీటిని సద్వినియోగం చేసుకుంటూ కోచ్‌ల వద్ద భద్రపర్చుకోవాల్సి ఉంటుంది. శిబిరాలకు ప్రథమ చికిత్స కిట్లు అందించేందుకుగాను జిల్లాకు రూ.5 వేలు మంజూరయ్యాయి.
కేంద్రం క్రీడ శిక్షకుడు
శ్రీరంగాపురం కబడ్డీ ప్రవీణ్
ఆత్మకూర్ వాలీబాల్ అబ్దుల్ ఖదీర్
ఖిల్లాఘనపురం అథ్లెటిక్స్ దేవేందర్
గోపాల్‌పేట ఫుట్‌బాల్ సందీప్
ఏదుల ఫుట్‌బాల్ రవీందర్
వనపర్తి ఫుట్‌బాల్ ప్రవీణ్
చిన్నమందడి వాలీబాల్ రమేశ్
పెద్దమందడి వాలీబాల్ మన్యం యాదవ్
పాన్‌గల్ వాలీబాల్ శ్యామల
(బాలికలు)
కల్వరాల, వీపనగండ్ల వాలీబాల్ శ్రీకాంత్
పెద్దగూడెం, వనపర్తి వాలీబాల్ శేఖర్
పెబ్బేరు–1 ఫుట్‌బాల్ నాగరాజు
పెబ్బేరు–2 ఫుట్‌బాల్ శంకర్
సోలీపూర్ హాకీ మన్యం యాదవ్
కడుకుంట్ల, వనపర్తి హాకీ నిరంజన్‌గౌడ్
వనపర్తి హకీ జావేద్, సాగర్
చిట్యాల, వనపర్తి కిక్‌బాక్సింగ్ వరుణ్‌కుమార్
30 రోజుల శిక్షణతో క్రీడాకారులకు ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. పాఠశాల స్థాయిలో నిర్వహించే క్రీడాపోటీలతో పాటు డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆడే అవకాశం లభిస్తుంది. వేసవి సెలవులు వృథా చేయకుండా ఆసక్తి గల విద్యార్థులకు రోజు ఉదయం 8 వరకు, సాయంత్ర ఐదు నుంచి ఆరు వరకు క్రీడల్లో శిక్షణనిస్తారు.
జిల్లాలో 17 వేసవి శిబిరాలు
14 ఏళ్లలోపు చిన్నారులకు అవకాశం
30 రోజుల పాటు కొనసాగనున్న శిక్షణ
శిక్షకులకు గౌరవ వేతనం చెల్లింపు


