డిపో అభివృద్ధికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

డిపో అభివృద్ధికి కృషి చేయాలి

May 1 2026 8:26 AM | Updated on May 1 2026 8:26 AM

వనపర్తి టౌన్‌: తోటి ఉద్యోగులు ప్రతిభ కనబర్చిన వారిని ఆదర్శంగా తీసుకొని డిపో ఆదాయం పెంచాలని, రీజియన్‌లో డిపోను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని ఆర్టీసీ డీఎం దేవేందర్‌గౌడ్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని డిపోలో గురువారం ఉత్తమ ఉద్యోగుల అభినందన కార్యక్రమం నిర్వహించి మార్చిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కండక్టర్లు, డ్రైవర్లు, మెయింటెనెన్స్‌ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతి అందించి మాట్లాడారు. ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణం, డీజిల్‌ ఆదా, బస్సుల నిర్వహణ, జీరో బ్రేక్‌డౌన్‌ ఉన్నవారిని అభినందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌, మెయింటెనెన్స్‌ సిబ్బంది, సూపర్‌వైజర్లు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో నారసింహ జయంత్యుత్సవాలు

వనపర్తిటౌన్‌: జిల్లాకేంద్రంలోని శంకర్‌గంజ్‌లో ఉన్న లక్ష్మీనారసింహస్వామి ఆలయంలో జయంత్యుత్సవాలు గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు వెంకటేశ్వరశర్మ నేతృత్వంలో ఉదయం శాస్త్రోక్తంగా సుప్రభాత సేవ, మూల, ఉత్సవ విగ్రహాలకు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలోని ఆంజనేయుడు, శివుడికి సైతం విశేషంగా పూజలు చేశారు. రాత్రి స్తంభపూజ, లక్ష పుష్పార్చన తదితర పూజా కార్యక్రమాలు కొనసాగాయి. అనంతరం ఉత్సవమూర్తులతో పల్లకీసేవ నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవాలు మూడురోజుల పాటు కొనసాగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

జాతీయ ఫుట్‌బాల్‌

పోటీలకు ఎంపిక

వనపర్తి రూరల్‌: పెబ్బేరుకు చెందిన పరమేష్‌ జాతీయ ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు కోచ్‌ నాగరాజు గురువారం తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో తెలంగాణ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ (టీఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో జరిగిన అండర్‌–20 జట్టు ఎంపికలో పరమేష్‌ అత్యంత ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికై నట్లు వివరించారు. మే నెల 3 నుంచి 25వ తేదీ వరకు ఛత్తీస్‌ఘడ్‌లో జరిగే జాతీయస్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున ఆడతారని పేర్కొన్నారు. గురువారం పట్టణంలో జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కృష్ణకుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, వెంకట్‌, అఫ్సర్‌, రాజేందర్‌, సీనియర్‌ క్రీడాకారులు పరమేష్‌ను అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement