● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్
ఎన్.ఖీమ్యానాయక్
వనపర్తి: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా మే నెల 11 నుంచి విద్యా వారోత్సవాలు పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితారాణా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి ఆయనతో పాటు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని పాల్గొన్నారు. ముందుగా ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా విద్యాశాఖలో అమలవుతున్న కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యా వారోత్సవాల్లో భాగంగా బడిబాట, పదోతరగతి, ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు రెమెడియల్ తరగతులు నిర్వహించేందుకు, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అదేవిధంగా సర్పంచులు, వార్డుసభ్యులు, కౌన్సిలర్లు అందరికీ నియోజకవర్గస్థాయిలో విద్యాశాఖ చేపడుతున్న కార్యక్రమాలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అవగాహన కల్పిస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి..
అమృత్ పథకంలో భాగంగా చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. గురువారం పుర పరిధిలోని హౌసింగ్‌బోర్డు కాలనీ, నర్సింగాయపల్లి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకులను పుర కమిషనర్, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. అదేవిధంగా పట్టణంలోని నర్సరీని పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. వేసవిలో జాగ్రత్తలు పాటిస్తూ మొక్కలు ఎండిపోకుండా సంరక్షించాలని సూచించారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


