వనపర్తిటౌన్: తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపాలని.. చదువుతోనే ఎన్నో విజయాలు సాధించగలరని జిల్లా విద్యాధికారి అబ్ధుల్ ఘని అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీచేసి అనంతరం తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లు అందజేసినట్లు తెలిపారు. బడిబాటలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను అధిక సంఖ్యలో చేర్పించాలని కోరారు. 10వ తరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించినందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను అభినందిస్తూ వచ్చే విద్యా సంవత్సరంలో సైతం ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పరీక్షల విభాగం అధికారి మద్దిలేటి, సీఎంఓ ప్రతాప్‌రెడ్డి, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ శేఖర్, ఏఎంఓ మహానంది, జీసీడీఓ శుభలక్ష్మి, బ్యాంక్ అధికారులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


