వనపర్తి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కొనసాగుతున్న ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఎస్‌ఐఆర్ ప్రత్యేక అధికారి చెన్నయ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్‌తో కలిసి తహసీల్దార్లు, సూపర్‌వైజర్లు, బీఎల్వోలతో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పురోగతిని పరిశీలించి నెమ్మదిగా సాగుతుండటానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 70 శాతం మాత్రమే పూర్తయిందని పేర్కొంటూ.. అన్ని మండలాల్లో ఈ ప్రక్రియను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. మరికొద్ది రోజుల్లో తిరిగి సమీక్ష నిర్వహిస్తామని, అప్పటికీ మ్యాపింగ్‌లో వెనుకబడిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో మ్యాపింగ్ శాతం గరిష్టస్థాయికి తీసుకెళ్లా లని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


